Share News

మత్తు పదార్థాల కలకలం

ABN , First Publish Date - 2023-11-22T00:01:15+05:30 IST

కర్నూలు మెడికల్‌ కాలేజీలో మత్తు పదార్థాల కలకలం రేగింది.

మత్తు పదార్థాల కలకలం

మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో గంజాయి, మద్యం

అర్ధరాత్రి తనిఖీల్లో బయటపడిన గంజాయి

ముగ్గురు వైద్యులతో విచారణ కమిటీ ఏర్పాటు

కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 21: కర్నూలు మెడికల్‌ కాలేజీలో మత్తు పదార్థాల కలకలం రేగింది. ఈ నెల 17, 18 తేదీల్లో అర్ధరాత్రి రాజ్‌విహార్‌ మెన్స్‌ హాస్టల్‌లో హాస్టల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ వార్డెన్లు తనిఖీ చేయడంతో విషయం బయటపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫస్ట్‌ ఇయర్‌ నుంచి ఫైనల్‌ ఇయర్‌ వరకు 470 మంది వైద్య విద్యార్థులు మెన్స్‌ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. హాస్టల్‌ డిప్యూటీ వార్డెన్‌, అసిస్టెంట్‌ వార్డెన్లు కలిసి 17, 18 తేదీల్లో అర్ధరాత్రి తనిఖీ చేశారు. ఓ గదిలో నలుగురు వైద్య విద్యార్థులు మద్యం తాగుతూ గంజాయి పీలుస్తూ కనిపించారు. ఇందులో ఇద్దరు విద్యార్థుల కీలకమైన పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అయితే మత్తు పదార్థాలను సేవించిన ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ డా.పి.సుధాకర్‌ ముగ్గురు వైద్యులతో విచారణ కమిటీ వేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ సాయిసుధీర్‌, ఎండోక్రైనాలజీ సీనియర్‌ ప్రొఫెసర్‌ పి.శ్రీనివాసులు, జనరల్‌ సర్జరీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డిప్యూటీ వార్డెన్‌ జయరాం కమిటీలో ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్‌ డా.పి.సుధాకర్‌, కమిటీ సభ్యులు మెన్స్‌ హాస్టల్‌లో విచారణ చేశారు. గంజాయి అసలు ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు తెచ్చారు.. ఎవరు ఇచ్చారని అధికారులు విద్యార్థులను ప్రశ్నించారు. దీనిపై కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.పి.సుధాకర్‌ను వివరణ కోరగా విచారణ పూర్తి కాగానే చర్యలు తీసుకుంటామన్నారు.

అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు మెడికల్‌ కాలేజీ మెన్స్‌ హాస్టల్‌లో మత్తు పదార్థాలు ఉన్నాయని సమాచారం ఉన్నా ప్రిన్సిపాల్‌ గానీ, అధికారులు గాని ఏ మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రిన్సిపాల్‌ చుట్టూ ఓ కోటరి ఉందని, దీని వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మెన్స్‌ హౌస్‌ సర్జన్‌ క్వాటర్స్‌, రాజ్‌విహార్‌ హాస్టల్‌లో మద్యం సీసాలు విపరీతంగా లభ్యమవుతున్నా ఇటు ఆసుపత్రి అధికారులు గానీ, ప్రిన్సిపాల్‌ గానీ ఏనాడూ చర్యలు చేపట్టలేదు. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-22T00:01:19+05:30 IST