వైసీపీని నమ్మి మోసపోవద్దు
ABN , First Publish Date - 2023-08-14T23:59:07+05:30 IST
వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి మళ్లీ మోసపోవద్దని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
కమీషన్లు తప్పా ప్రజల కష్టాలు వారికి తెలియదు వీఆర్‌ఎస్పీ ఆధునీకరణ పనులన్నీ నాసిరకమే : బుడ్డా
ఆత్మకూరు, ఆగస్టు 14: వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి మళ్లీ మోసపోవద్దని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వడ్లరామాపురం శివారులో ప్రమాదకరంగా మారిన పెద్దమల్లెలమ్మ చెరువుకట్టను సోమవారం ఆయన సందర్శించి అక్కడి రైతులతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే వీఆర్‌ఎస్పీ కాల్వలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్ల వైసీపీ పాలనలో చెరువుల అభివృద్ధికి ఎటువంటి చొరవ తీసుకోకపోవడం వల్లే నేడు చెరువులకు గండ్లు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని వివరించారు. అసలు పెద్దమల్లెలమ్మ, చిన్నమల్లెలమ్మ చెరువులను చూస్తుంటే తూములు దెబ్బతిని, చెరువుకట్టలు బలహీనపడి అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చెరువుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటివరకే వీఆర్‌ఎస్పీ ప్రాజెక్టే సందర్శించని ఎమ్మెల్యే శిల్పా ఆ ప్రాజెక్ట్‌పై ఎటువంటి అవగాహన లేదని, కేవలం రైతులను మభ్యపెట్టేందుకు హామీలు ఇచ్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఎమ్మెల్యే శిల్పాకు కమీషన్లు తీసుకోవడం తప్పా ప్రజల కష్టాల గురించి తెలియవని అన్నారు. ఈయన వెంట శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, నాయకులు వేణుగోపాల్, శివప్రసాద్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, రాజారెడ్డి, శ్రీరామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.