‘రాష్ట్రంలో నియంత పాలన’

ABN , First Publish Date - 2023-09-26T00:00:20+05:30 IST

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోటరాముడు, సీపీఐ మండల కార్యదర్శి పులిశేఖర్‌ ధ్వజమెత్తారు.

‘రాష్ట్రంలో నియంత పాలన’
డోన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు, కార్మికులు

డోన్‌(రూరల్‌), సెప్టెంబరు 25: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోటరాముడు, సీపీఐ మండల కార్యదర్శి పులిశేఖర్‌ ధ్వజమెత్తారు. చలో విజయవాడ కార్యక్రమానికి తరలిన అంగన్‌వాడీ వర్కర్లను మధ్యాహ్న భోజన వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాత బస్టాండులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ పాద యాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు కోరుతూ శాంతి యుతంగా ఆందోళనలు చేపడుతున్న అంగన్‌వాడీ వర్కర్లను, మధ్యాహ్న భోజన వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అరెస్టులు చేయించడం, గృహ నిర్బంధం చేయడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో డోన్‌ ఏఐటీయూసీ నాయకులు పుల్లయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

బేతంచెర్ల: అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న ఉద్యమాలను ప్రభుత్వం ఆపలేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య, వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పట్టణంలోని పాతబస్టాండులో అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పెన్షన్‌ సౌకర్యం, ఎస్‌ఆర్‌ఎస్‌యాప్‌ను రద్దు చేయాలని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. న్యామైన కోరికలు తీర్చాలని ఛలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం చాలా దుర్మార్గమన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్‌వాడీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు రోజా, అంజినమ్మ, జి.లక్ష్మి, లక్ష్మీదేవి, రేణుక, మహాలక్ష్మి, సాలమ్మ, హేమలత, సంతోషి, సరళ, సరోజ, సరస్వతి, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణంలో అంగన్‌వాడీ సంఘం నాయకురాళ్లు వెంకటలక్ష్మి, సీఐటీయూ నాయకుడు వెంకటేశ్‌ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ పంచాయతీ సర్కిల్‌లో ధర్నా చేశారు. అంగన్‌వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ పట్టణంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ధర్నా చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:00:20+05:30 IST