ఆనవాళ్ల కూల్చివేత

ABN , First Publish Date - 2023-03-25T23:17:43+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చారిత్రక భవనాల కూల్చివేతను అధికారులు శనివారం ఆరంభించారు.

   ఆనవాళ్ల కూల్చివేత
పత్తి ఓల్డ్‌ స్టోరేజీ బిల్డింగ్‌ను కూల్చివేత దృశ్యం.

ఆర్‌ఏఆర్‌ఎస్‌ భవనాలను టార్గెట్‌ చేసుకున్న అధికారులు

80, 90 ఏళ్లనాటి చెట్ల నరికేందుకు రంగం సిద్ధం

యూనివర్సిటీ అనుమతులు లేకుండానే నిర్ణయాలు

అధికార పార్టీ నాయకుడి మార్గదర్శకత్వంలో అధికారులు ?

నంద్యాల టౌన, మార్చి 25 : నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చారిత్రక భవనాల కూల్చివేతను అధికారులు శనివారం ఆరంభించారు. ఇది నంద్యాల ప్రాంతవాసుల్లో తీవ్ర కలకలం రేపింది. నంద్యాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వైద్య కళాశాల నిర్మాణానికి ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన 50ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి అనుమతి తీసుకోకుండానే ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన ఓ ముఖ్య అధికారి నేతృత్వంలో భవనాలు కూల్చివేశారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత చెప్పడంతో అధికారులు కూల్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి

విలువైన వృక్ష సంపదపై గొడ్డలి వేటు :

ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రాంగణంలో 80, 90 సంవత్సరాల వయసున్న వేప, చింత తదితర చెట్లు ఉన్నాయి. వీటిని కూడ నరికి వేసేందుకు ఓ అధికారి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న తన కిందిస్థాయి శాస్త్రవేత్తలతో ఓ కమిటీని ఏర్పాటు చేసి కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం కమిటీని ఏర్పాటు చేసి మూడురోజుల వ్యవధిలోనే పత్తి స్టోరేజ్‌ బిల్డింగ్‌తో పాటు చెట్లను నరికివేసేందుకు మోస్ట్‌ అర్జెంట్‌ పేరుతో ఓ సర్క్యులర్‌ రిలీజ్‌ కావడం వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుడు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆర్‌ఏఆర్‌ఎస్‌ భవనాల ఆనవళ్లు వైద్య కళాశాల ప్రాంగణంలో ఉండరాదంటూ అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి హుకుంతోనే కూల్చివేత మొదలైనట్లు తెలుస్తోంది. కాగా ఈ కూల్చివేతలు, చెట్ల నరికివేతకు ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన నిధులనే ఖర్చు చేస్తుండడం మరింత విస్మయానికి తెర లేపుతోంది. ఇంత జరుగుతున్నా ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని ముఖ్య అధికారులు, శాస్త్రవేత్తలు ఎవరూ నోరుమెదపడం లేదు. వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉన్నతాధికారులు, అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే తప్ప కూల్చివేతలు ఆగవని పలువురు అంటున్నారు.

Updated Date - 2023-03-25T23:17:43+05:30 IST