Rayalaseema Reservoirs: కట్టలు కుంగుతున్నాయ్!
ABN , First Publish Date - 2023-06-07T04:08:51+05:30 IST
రాయలసీమ జలాశయాలకు ప్రమాదం పొంచి ఉంది. వెలుగోడు జలాశయం, అలగనూరు రిజర్వాయర్ల రాతిపరుపు (స్టోన్ రివెట్మెంట్) కుంగిపోతోంది.
సీమ జలాశయాలకు ముప్పు
కుంగిపోతున్న మట్టి ఆనకట్టల రాతిపరుపు
ఇప్పటికే కుంగిన అలగనూరు, వెలుగోడు స్టోన రివెట్మెంట్
గోరుకల్లు జలాశయంలో కూడా.. మరమ్మతులకు రూ.175 కోట్లు
కావాలని ప్రతిపాదనలు.. పైసా విదల్చని రాష్ట్రప్రభుత్వం
రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే జలాశయాల భద్రత ప్రమాదంలో పడింది. మట్టి ఆనకట్టలు ప్రశ్నార్థకంగా మారాయి. రాతి పరుపు (స్టోన రివెట్మెంట్) కుంగిపోతోంది. ఆనకట్ట వెలుపలి వైపు వర్షపు నీటికి కోతకు గురవుతున్నాయి. నిర్వహణను గాలికి వదిలేయడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం.
(కర్నూలు-ఆంధ్రజ్యోతి): రాయలసీమ జలాశయాలకు ప్రమాదం పొంచి ఉంది. వెలుగోడు జలాశయం, అలగనూరు రిజర్వాయర్ల రాతిపరుపు (స్టోన్ రివెట్మెంట్) కుంగిపోతోంది. మరమ్మతులకు నిధులు కావాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. దీంతో మరమ్మతులు చేయలేదు. రెండ్రోజుల క్రితం గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన గోరుకల్లు జలాశయం శాండ్, మెటల్ ఫిల్టర్ దెబ్బతిని రాతిపరుపు కుంగిపోవడంతో రైతులు, దిగువ గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టారు. శ్రీశైలం జలాశయం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 38 టీఎంసీల కృష్ణా వరద జలాలను మళ్లించి సాగు, తాగునీరు అందించడం దీని లక్ష్యం. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామ సమీపంలో 12.44 టీఎంసీల సామర్థ్యంతో గోరుకల్లు జలాశయం నిర్మించారు.
రిజర్వాయరు మట్టి ఆనకట్ట (ఎర్త్‌డ్యాం) పొడవు 3.6 కి.మీలు. ఎత్తు గరిష్టంగా 45.12 మీటర్లు. గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రిజర్వాయరును వరద జలాలతో నింపితే.. లీకేజీలు వచ్చాయి. రాష్ట్ర ఇరిగేషన నిపుణుల కమిటీ సూచనల మేరకు మరమ్మతులు చేపట్టింది. 2022-23 నీటి సంవత్సరంలో 11 టీఎంసీలు నిల్వచేశారు. ప్రస్తుతం 3 టీఎంసీల నీరుఉంది. మూడ్రోజుల క్రితం 60 మీటర్ల పొడవు, 37 మీటర్ల వెడల్పుతో రాతిపరుపు (స్టోన రివెట్మెంట్) కుంగిపోయింది. దిగువన శాండ్ ఫిల్టర్, మెటల్ ఫిల్టర్ దెబ్బతినడం వల్లే రాతిపరుపు కుంగిపోయిందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. జలవనరుల శాఖ ప్రాజెక్టుల కర్నూలు సీఈ కబీర్ బాషా.. బండ్ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇక ఆనకట్ట బయటి వైపు వర్షపునీటి ప్రవాహానికి పలుచోట్ల కోతకు గురై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ముళ్లకంపలు పెరిగాయి. జగన ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా నిర్వహణకు నిధులు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని సీమ సాగునీటి నిపుణులు అంటున్నారు.
వెలు‘గోడు’ వినేదెవరు..?
రాయలసీమ జీవనాడి తెలుగుగంగ ప్రాజెక్టు. కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు సాగునీరు, తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి 15 టీఎంసీల తాగునీరు అందించాలనే ఆశయంతో 1983 ఏప్రిల్ 18న అప్పటి ఆంధ్రప్రదేశ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎంజీఆర్ అంతర్రాష్ట్ర ఒప్పందంపై సంతకాలు చేసి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 16.95 టీఎంసీల సామర్థ్యంతో వెలుగోడు జలాశయం నిర్మించారు. తెలుగుగంగ ప్రాజెక్టులో తొలి రిజర్వాయరు ఇదే. దీని ఎర్త్‌డ్యాం బండ్ రివెట్మెంట్ అక్కడక్కడాకుంగిపోయింది. 1,000 మీటర్లకుపైగా కుంగినట్లు ఇంజనీర్లు ఏనాడో గుర్తించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు చేయడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో డ్యాం రిహాబిలిటేషన అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (డ్రిప్)-2 కింద రూ.99 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా నిధులివ్వలేదు. ఆ తర్వాత.. కుంగిన రాతిపరుపు మరమ్మతులతో పాటు ఎర్త్‌డ్యాం బండ్ 11.64 కిలోమీటర్లు బలోపేతం, బయటి వైపున మట్టికట్ట కోతకు గురికాకుండా గడ్డి పెంపకం, స్పిల్‌వే గేట్ల మరమ్మతుల వంటి పనుల కోసం రూ.150-155 కోట్లు కావాలని డ్రిప్-3 క్రింద మరోసారి ప్రతిపాదనలు పంపినట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. జగన ప్రభుత్వం మాత్రం నిధులు ఇవ్వడం లేదు.
అలగనూరు మరమ్మతులు ఎప్పుడో..?
కర్నూలు-కడప (కేసీ) కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరందించేందుకు మిడుతూరు మండలంలో నిర్మించిన అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎర్త్ బండ్ కుంగిపోయి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో రెండుళ్లుగా నీటిని నింపడం లేదు. కేసీ కెనాల్ కింద కర్నూలు జిల్లాలో 1.73 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 92 వేల ఎకరాలు కలిపి 2.65 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలి. కృష్ణా ట్రైబ్యునల్-1 అవార్డు కింద 31.90 టీఎంసీల నీటివాటా ఉన్నా.. నిల్వ చేసుకునే జలాశయం లేదు. దీంతో కడప జిల్లాలో పంట చివరి దశలో సాగునీరు అందక నష్టపోతున్న రైతులను ఆదుకోవాలనే లక్ష్యంగా 1999లో 2.96 టీఎంసీల సామర్థ్యంతో అలగనూరు జలాశయం నిర్మించారు. 3,358 ఎకరాల విస్తీర్ణం, 7.5 కి.మీ. పొడవు, 22 మీటర్ల ఎత్తులో మట్టి ఆనకట్ట నిర్మించారు. 2004లో నిర్మాణ పనులు పూర్తి చేసి 2005లో తొలిసారిగా నీటిని నింపారు. తర్వాత 200 మీటర్లకుపైగా కట్ట కుంగిపోయింది. రూ.3 కోట్లతో మరమ్మతులు చేపట్టినా కాంట్రాక్టరు సకాలంలో పనులు చేయక ఆనకట్ట మరింతగా కుంగింది. పరిశీలించిన నిపుణుల కమిటీ మట్టి ఆనకట్ట మొత్తాన్నీ ఆధునికీకరించాలని సూచించింది. దీంతో మొదటి కాంట్రాక్టరును తీసివేసి.. రూ.22 కోట్లకు మళ్లీ ప్రతిపాదనలు పంపామని సీఈ కబీర్ బాషా చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. దీంతో అలగనూరులో రెండేళ్లుగా తాగునీటిని నింపలేదు.