ఎస్‌బీఐకి వినియోగదారుల కమిషన షాక్‌

ABN , First Publish Date - 2023-05-26T23:49:49+05:30 IST

ఖాతాదారుడి ఖాతా హ్యాక్‌ అయి.. ఆ పై జరిగిన లావాదేవీల ఎస్‌ఎంఎస్‌లను పంపని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన శుక్రవారం షాక్‌ ఇచ్చింది.

ఎస్‌బీఐకి వినియోగదారుల కమిషన షాక్‌

నిర్లక్ష్యంగా వ్యవహరించిన కణేకల్లు బ్రాంచకు తాఖీదులు

బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశం

కర్నూలు(లీగల్‌) మే 26: ఖాతాదారుడి ఖాతా హ్యాక్‌ అయి.. ఆ పై జరిగిన లావాదేవీల ఎస్‌ఎంఎస్‌లను పంపని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన శుక్రవారం షాక్‌ ఇచ్చింది. ఎస్‌ఎంఎస్‌లు పంపకపోవడం, అందుకు సంబంధించిన లావాదేవీలను తెలపకపోవడంతో జరిగిన నష్టాన్ని బ్యాంకే భరించాలని ఆదేశిస్తూ వినియోగదారుల కమిషన తీర్పునిచ్చింది. హాలహర్వికి మండలానికి చెందిన డాక్టర్‌ ఈ.ఈరన్న వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో పనిచేస్తున్న సమయంలో అక్కడి ఎస్‌బీఐ బ్రాంచలో ఓ ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత 2018 నవంబరు 28న కొత్త ఏటీఎం కార్డు కోసం ఎస్‌బీఐ నుంచి కాల్‌ చేస్తున్నామంటూ ఓ అపరిచిత వ్యక్తి కాల్‌ చేసి ఈరన్న కార్డు నెంబర్‌, ఓటీపీ వివరాలు తెలుసుకున్నాడు. ఆ వెంటనే వారం రోజుల వ్యవధిలో ఏటీఎం కార్డును ఆ వ్యక్తి హ్యాక్‌ చేసి 35 సార్లు రూ.4,21,000ను వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. అయితే.. ఈ 35 లావాదేవీలకు సంబంధించి ఒక్క మెసేజ్‌ కూడా బ్యాంకు నుంచి ఖాతాదారుడికి రాలేదు. నగదు ఖాళీ అయిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు బ్యాంకును సంప్రదించగా.. బ్యాంకు అధికారులు స్పందించలేదు. దీంతో ఆయన కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషనను ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కమిషన బ్యాంకు ఖాతాదారుడికి ఎస్‌ఎంఎస్‌లు పంపకపోవడం సేవాలోపం అవుతుందని, జరిగిన నష్టానికి సదురు బ్యాంకే బాధ్యత వహించాలని తీర్పునిచ్చింది. దీంతో బాధితుడు ఈరన్నకు రూ.4.21 లక్షలకు ఆరు శాతం వడ్డీతో పాటు నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ.15వేలు బ్యాంకుకు తిరిగి చెల్లించాలని వినియోగదారుల కమిషన అధ్యక్షుడు కరణం కిశోర్‌ కుమార్‌, సభ్యులు ఎన.నారాయణ రెడ్డి, నజీమా కౌసర్‌లు తమ తీర్పులో పేర్కొన్నారు.

Updated Date - 2023-05-26T23:49:49+05:30 IST