Share News

‘సీఎం జగన్‌ నమ్మక ద్రోహి’

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:27 AM

ముఖ్యమంత్రి జగన్‌ నమ్మకద్రోహి అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ పరిశీలకుడు బాజీ చౌదరి విమర్శించారు.

‘సీఎం జగన్‌ నమ్మక ద్రోహి’
మాట్లాడుతున్న బీసీ జనార్దన్‌రెడ్డి, బాజీ చౌదరి

బనగానపల్లె, డిసెంబరు 28: ముఖ్యమంత్రి జగన్‌ నమ్మకద్రోహి అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ పరిశీలకుడు బాజీ చౌదరి విమర్శించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి పెట్టడం సీఎం జగన్‌ లక్షణమని అన్నారు. విశ్వసనీయత లేని వ్యక్తి జగన్‌ అని, ఆయన నైజం ఏమిటో ప్రజలకు అర్థమైం దని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు. ఎంపీగా అధిక మెజార్టీతో కడపలో గెలిచి కడప ప్రజలను మోసం చేశారన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌కు ఎగనామం పెట్టి అన్నమయ్య డ్యాం బాధితులను నట్టేట ముంచారన్నారు. కృష్ణ, తుంగభద్ర జలాల హక్కులపై ఇతర రాష్ట్రాలకు ధరాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం చేశారన్నారు. తల్లికి, చెల్లి ఇలా నమ్మిన వారందరికీ ద్రోహం చేశారన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచి రూ.64వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారిమళ్లించారన్నారు. 120 సంక్షేమ పథకాలు రద్దు చేశారన్నారు. 1.40లక్షల బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు. 14లక్షల అసైన్‌మెంట్‌ భూములు కబ్జా చేశారన్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానని 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటిచ్చి నిరుద్యోగులకు మోసం చేశారన్నారు. రాజధాని అమరావతిపై కేసులు వేయడమే గాక, జగన్‌కు నమ్మకంగాఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డికి నమ్మక ద్రోహం చేశారన్నారరు. చివరకు ప్రశాంత్‌కిశోర్‌ నమ్మకాన్ని కోల్పోయిన జగన్‌కు విశ్వతనీయత లేదని విమర్శించారు.

డోన్‌: గత ఎన్నికల ముందు మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నమ్మకద్రోహం చేశారని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ చెప్పేదొకటి.. చేస్తున్నదొకటని మండిపడ్డారు. 56 నెలల పాలనలో జగన్‌ విశ్వసనీయత కోల్పోయి ప్రజలను వంచించారన్నారు. మధ్య నిషేదం చేస్తానని నమ్మించి చివరకు అప్పుల కోసం మద్యం ఆదాయాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టడం నమ్మకద్రోహం కాదా? అని ప్రశ్నించారు. నాసీరకం మద్యం పోస్తూ మహిళల పుస్తెలను తెంచుతున్న దారుణాలు వైసీపీ పాలనలో జరుగుతున్నాయన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచనని హామీ ఇచ్చి 8 సార్లు పెంచడం నమ్మకద్రోహం కాదా అని..? ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సిటిజన్‌ బిల్లుకు ఓటు వేసి దళితులకు, మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సీపీఎస్‌ రద్దు ఏమైందని, ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ విడుదల చేశారో సమాధానం చెప్పాలన్నారు. రైతుభరోసా రూ.12,500 ఇస్తానని చెప్పి రైతులకు కోతలు పెట్టారని ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, అభిరెడ్డిపల్లె గోవిందు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 12:27 AM