భోగి భాగ్యం
ABN , First Publish Date - 2023-01-14T23:43:32+05:30 IST
మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఆరంభమయ్యాయి.
పిల్లలకు భోగి పళ్లు
పాతకు స్వస్తి కొత్తదనానికి స్వాగతం
ఏ గుమ్మం చూసినా ఆకట్టుకునే రంగవల్లికలు
గాలిపటాలతో చిన్నారుల కేరింతలు
ఉమ్మడి జిల్లా పల్లెసీమల్లో సందడి
కర్నూలు (కల్చరల్), జనవరి 14: మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఆరంభమయ్యాయి. శనివారం భోగి వేడుకను ఘనంగా నిర్వహించారు. పల్లెలతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ భోగి వేడుకల సందడి బాగా కానవచ్చింది. వాడవాడలా వేకువ జామునే భోగి మంటలు వేశారు. పాత సామగ్రిని, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కాల్చి, పాతకు స్వస్తి చెప్పి, కొత్త క్రాంతికి స్వాగతించారు. భోగి వేడుకల్లో భాగంగా పిల్లలకు భోగి పళ్లు పోసి వారికి దిష్టి తీశారు. వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటూ నువ్వులు కలిపిన చేసిన సొద్ద రొట్టెలు తయారు చేసుకున్నారు. కాగా ఆదివారం సంక్రాంతి, సోమవారం కనుమ వేడుకలకు హైందవ కుటుంబాలన్నీ సిద్ధమయ్యాయి. గ్రామ సీమల్లో రైతులు తమ వేడుకల సందడి కానవస్తోంది.
ఫ ఎగసిన భోగి మంటలు...
జిల్లాలోని పల్లెసీమల్లోని ప్రజలు భోగి మంటలు వేసి మురిసిపోయారు. వివిధ ప్రాంతాల్లో బతుకుదెరువుకు వెళ్లినవారు తమ తమ గ్రామాలకు చేరుకొని తొలి రోజు భోగిని ఉత్సాహంగా ప్రారంభించారు. తొలిరోజున వేకువ జామునే నిద్ర లేచి, పల్లెల్లోని నాలుగు రోడ్ల కూడళ్లు, ఇళ్ల ముందు భోగి మంటలు వేసి, పాత వస్తువులు, పనికి రాని సామగ్రిని అగ్ని దేవుడికి సమర్పించారు. పిల్లలకు భోగి దిష్టి బొట్లు తీసి, భోగి పండ్లతో స్నానాలు చేయించారు. భోగి రోజున నువ్వులతో కలిపి తయారు చేసిన సొద్ద రొట్టెల పండుగ ఉత్సాహంగా నిర్వహించారు. గుమ్మడి కూర, వంకాయ కూరలతో ఈ రొట్టెల పండుగను సంబరంగా నిర్వహించుకున్నారు.
ఫ పశు సంపదను గుర్తు చేసేదే ‘కనుమ పండుగ’
రైతులు తమ వ్యవసాయ పనులకు ఏడాదంతా ఆసరాగా నిలిచి ఉండే పశువుల కోసం ‘కనుమ’ పండుగ ఘనంగా నిర్వహిస్తారు. తమ ఇళ్లలోని గోవులు, బర్రెలు, ఎద్దులకు ఆరోజున శుభ్రంగా స్నానం చేయించి, పసుపు, కుంకుమలతో వాటిని అందంగా ముస్తాబు చేస్తారు. పశు సంపదను మరింత అభివృద్ధి చేయాలని, తమ వ్యవసాయ పనులకు మరింత అండగా నిలవాలని వాటిని పూజిస్తారు. ఆరోజున ఎడ్లను అందంగా ముస్తాబు చేసి, గ్రామంలో తిప్పుతారు. ఎండ్లబండ్ల పందేలు, కోడి పందేలు, గాలిపటాల పందేలు నిర్వహిస్తారు.