టీడీపీ వర్గీయులపై దాడి

ABN , First Publish Date - 2023-03-30T23:51:37+05:30 IST

డోన్‌ మండలంలోని మల్లెంపల్లె గ్రామంలో గురువారం వైసీపీ నాయకులు రెచ్చిపోయారు.

టీడీపీ వర్గీయులపై దాడి

ముగ్గురికి గాయాలు

రాళ్లు, కట్టెలతో వైసీపీ నాయకుల దౌర్జన్యం

పరిస్థితి ఉద్రిక్తం.. భారీగా మోహరించిన పోలీసులు

డోన్‌, మార్చి 30: డోన్‌ మండలంలోని మల్లెంపల్లె గ్రామంలో గురువారం వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. టీడీపీ వర్గీయుల ఇళ్లపై రాళ్లు, కట్టెలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో టీడీపీ వర్గానికి చెందిన సలీంద్ర పెద్ద (ఎస్‌పీ) సుంకన్న, సులోచన, జయమ్మ గాయపడ్డారు. వైసీపీ వర్గానికి చెందిన రాజు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామంలోని టీడీపీ వర్గానికి చెందిన సుధాకర్‌ వైసీపీకి చెందిన మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ రామచంద్రుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పండుగ అవసరాలకు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని రామచంద్రుడిని సుధాకర్‌ అడిగాడు. దీంతో వైసీపీ నాయకుడి కుమారుడు సుధీర్‌.. డ్రైవర్‌ సుధాకర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ విషయం టీడీపీ వర్గీయులకు చేరింది. గ్రామంలోని శ్రీరాముల దేవాలయం దగ్గర ఉన్న వైసీపీ నాయకుడు రామచంద్రుడుపై టీడీపీకి చెందిన గోపాల్‌ దాడి చేశాడు. ఆ తర్వాత సుధీర్‌ తన అనుచరులతో కలిసి టీడీపీ వర్గీయుడు ఎస్‌.పి. సుంకన్న ఇంటిపై రాళ్లు... కట్టెలతో దాడి చేశాడు. ఈ ఘటనలో సలీంద్ర పెద్ద సుంకన్న, సులోచన, జయమ్మ గాయాలపాలయ్యారు. వారిని డోన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టీడీపీ వర్గీయుడి చేతిలో గాయపడిన వైసీపీకి చెందిన రాజును కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. దాడులతో మల్లెంపల్లె గ్రామంలోని వీధులు దద్దరిల్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితికి ఏర్పడింది.

టీడీపీ వర్గీయులకు పరామర్శ

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ వర్గీయుడు సలీంద్ర పెద్ద సుంకన్నను పార్టీ యువ నాయకుడు ధర్మవరం గౌతమ్‌రెడ్డి తదితర టీడీపీ నాయకులు పరామర్శించారు. టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఫోన్‌లో బాధితులను పరామర్శించారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

భారీగా మోహరించిన పోలీసులు

మల్లెంపల్లె గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్యాపిలి సీఐతో పాటు పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఇరువర్గాలపై కేసులు

మల్లెంపల్లె గ్రామంలో జరిగిన దాడుల్లో ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తున్నట్లు డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామంలో కొన్ని రోజుల పాటు పికెట్‌ కొనసాగిస్తామని తెలిపారు.

Updated Date - 2023-03-30T23:51:37+05:30 IST