సేఫ్‌గా వచ్చేశారు...

ABN , First Publish Date - 2023-05-09T00:13:15+05:30 IST

సేఫ్‌గా వచ్చేశారు...

సేఫ్‌గా వచ్చేశారు...

ఇంఫాల్‌ నుంచి క్షేమంగా చేరుకున్న 8 మంది విద్యార్థులు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 8: మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుకోడానికి కర్నూలు నుంచి వెళ్లిన ఎనిమిది మంది విద్యార్థులు సురక్షితంగా తిరిగి వచ్చారు. వేర్వేరు గిరిజన తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్‌ రాష్ట్రం అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇంఫాల్‌లో చదువుతున్న కర్నూలు జిల్లాకు చెందిన 8 మంది విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల స్వస్థలాలకు చేర్చింది. కర్నూలు మండలం నిడ్జూరు గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి కుమారుడు ప్రశాంత్‌ రెడ్డి, బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన శివకుమార్‌, కర్నూలుకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ కుమార్తె చరిత, పుల్లయ్య కుమారుడు భరత్‌, బి.ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు లోక్‌నాథ్‌ రెడ్డి, వీరసాయినాగరాజు కుమారుడు సాయిచక్రధర్‌, భీమ్‌రాజు కుమారుడు మల్లెపోగు కుమార్‌, శాంతిరాజు కుమారుడు జీఎస్‌ రాజు మణిపూర్‌లో, ఇంఫాల్‌లో సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, ఎన్‌ఐటీలలో బీటెక్‌ కోర్సులు చదువుతున్నా రు. గత 5 రోజుల కిందట ఘర్షణలు మొదలు కావడంతో కర్నూలు జిల్లా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ పరిస్థితులను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మొబైల్‌ ద్వారా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం 10.45 గంటలకు ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టు నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 2.45 గంటలకు ఫ్లైట్‌లో వారిని తరలించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బస్సుల్లో విద్యార్థులను కర్నూలుకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

భయపడ్డాను

మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఎన్‌ఐటీలో ఈసీఈ గ్రూపులో నాలుగో సంవత్సరం చదువుతున్నాను. గత నాలుగైదు రోజులుగా అక్కడ జరుగుతున్న అల్లర్ల వల్ల భయపడ్డాను. ఇళ్లు, షాపులు తగులబెట్టారు. బాంబు దాడులు జరిగాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్యాంపస్‌ గదుల్లోనే ఉన్నాం.

- సాయిచక్రధర్‌, సంతోష్‌నగర్‌, కర్నూలు

ఇబ్బందులు పడ్డాం

మణిపూర్‌లో గొడవల వల్ల గత ఐదు రోజుల నుంచి ఫుడ్‌ సరిగ్గా అందడం లేదు. దొరికిన ఫుడ్‌ బాగా లేదు. మంచినీరు కూడా కరువైంది. చుట్టూ బాంబుల శబ్దాలు వినిపిస్తుండటంతో భయమేసింది. ప్రొఫెసర్‌ అనిల్‌ కుమార్‌ వెంటనే ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక ఫ్లైట్‌ను ఏర్పాటు చేశారు.

- బి.లోకనాథ్‌ రెడ్డి, రెవెన్యూ కాలనీ, కర్నూలు: (ఎన్‌ఐటీలో మెకానికల్‌ ఇంజనీర్‌)

క్షేమంగా ఇళ్లకు చేరుకున్నాం

మణిపూర్‌లో అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుతున్నాను. ఉన్న ఫళంగా గొడవలు మొదలు కావడంతో భయమేసింది. ఇళ్లు, షాపులు తగులబెట్టారు. ఎక్కడ చూసినా సైన్యమే. తుపాకుల శబ్దం మార్మోగిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఐదు రోజులు గడిపాం.

- ఎం.ప్రశాంత్‌రెడ్డి, నిడ్జూరు, కర్నూలు

భయం భయంగా జీవించాం

నేను ఇంఫాల్‌లోని సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్నాను. మణిపూర్‌ రాష్ట్రంలో సుమారు 4వేల ఇళ్లు తగలబడిపోయాయి. రెండు తెగల మధ్య ఘర్షణతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. మమ్మల్ని యూనివర్శిటీ నుండి బయటకు రానియ్యలేదు. భయం భయంగా గడిపాం.

-పెండేకంటి శివకుమార్‌, బనగానపల్లె

భయానక వాతావరణం నుంచి బయటపడ్డా

నేను మణిపూర్‌లోని ఎన్‌ఐటీ విశ్వ విద్యాలయంలో ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతునా. మణిపూర్‌లో ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకొని మారణహోమం దాక వెళ్లాయి. ఎన్‌ఐటీ యూనివర్సిటీ క్యాంపస్‌లోనే మేమంతా ఉన్నాం. బయటి వాతావరణం భయానకంగా ఉంది. బాంబుల శబ్దాలు, గృహాలకు నిప్పంటించడంతో వస్తున్న పొగలు చూసి మనస్సు చలించిపోయింది. ఘర్షణలు ప్రారంభమైన మూడురోజులకు క్యాంపస్‌కు నీరు రావడం బంద్‌ అయిపోయింది. అదంతా భయానక వాతావరణం. ఎలాగో బైటపడ్డాం.

- కొప్పెర మధు కిశోర్‌, నందవరం, బనగానపల్లె.

Updated Date - 2023-05-09T00:13:24+05:30 IST