అంగన్‌వాడీలంటే.. ఇంత నిర్లక్ష్యమా?
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:04 AM
అంగన్‌వాడీలంటే.. ఇంత నిర్లక్ష్యమా?
రానున్న ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పండి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు పిలుపు
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 28: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో అంగన్‌వాడీ వర్కర్ల సంక్షేమం తన బాధ్యత అని, అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చి.. ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తారా? అని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు ధ్వజమెత్తారు. గురువారం కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద అంగన్‌వాడీ వర్కర్ల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గత 17 రోజులుగా అంగన్‌వాడీ వర్క ర్లు, హెల్పర్లు తమ న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని ఉద్యమిస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. చాలీచాలని జీతాలతో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక అంగన్‌వాడీ వర్కర్లు కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు అంగన్‌వాడీల జీతాలు పెంచి, వాళ్ల అన్ని సమస్యలు తీరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధరూర్ జేమ్స్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు హనుమంతరావు చౌదరి, ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్షావలి, కార్యదర్శి క్రిష్ణయ్య, ముంతాజ్‌బేగం, ఉయ్యాలవాడ రమేష్, విష్ణు పాల్గొన్నారు.