మంత్రి అనుచరుల వీరంగం
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:15 AM
ఆలూరు నియోజకవర్గంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు రెచ్చిపోయారు.
ఆస్పరిలో వైసీపీ నేత విరూపాక్షి ఫ్లెక్సీల ధ్వంసం
వాటిని కవర్ చేయబోయిన వారిపై అల్లరిమూకల దాడి
గాయపడ్డ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శివకేశవ్
దాడులను ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే నిరసనలు
కర్నూలు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు రెచ్చిపోయారు. ఈసారి గుమ్మనూరుకు ఆలూరు టికెట్ కష్టమేనన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. అధినేతపై ఉన్న కోపాన్ని పత్రికా విలేకరులపై చూపుతున్నారు. గుమ్మనూరు అనుచరులు వ్యవహారశైలిపై వైసీపీలోని కొందరు ముఖ్య నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుమ్మనూరు అనుచరులు చేస్తున్న ఆగడాలను చిత్రీకరిస్తున్న ఆస్పరి ఆంధ్రజ్యోతి విలేకరి శివకేశ్‌పై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు.
గురువారం ఆస్పరి మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైసీపీకి చెందిన చిప్పగిరి జడ్పీటీసీ సభ్యుడు బి.విరుపాక్షి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే కూడలిలో మంత్రి గుమ్మనూరు జయరాం తనయుడు, వైసీపీ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్, తమ్ముళ్లు ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ గుమ్మనూరు నారాయణ, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు జగన్ జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాం, చిప్పగిరి జడ్పీటీసీ సభ్యుడు విరుపాక్షిల మధ్య రాజకీయ వర్గవిభేదాలు ఉన్నాయి. విరుపాక్షి ఏర్పాటు చేసిన జగన్ ఫ్లెక్సీలు చూస్తే వారికి కోపం వచ్చిందేమో మంత్రి అనుచరులు రెచ్చిపోయారు. వైసీపీ జెండా కర్రలు చేపట్టుకొని భీభత్సం సృష్టించారు. విరుపాక్షి కట్టిన జగన్ ఫ్లెక్సీలు చింపేశారు. ఇది వారి పార్టీ వర్గవిభేదాలకు సంబంధించింది. అయితే.. జయరాం అనుచరులు జడ్పీటీసీ విరుపాక్షి ఏర్పాటు సీఎం జగన్ ఫ్లెక్సీలు చింపేస్తుంటే ఆ దృశ్యాలను ఫొటోలు తీయడం, అక్కడి సంఘటన కవర్ చేయడం పాత్రికేయుల కనీస ధర్మం. జగన్ పుట్టిన కేక్ కట్ చేస్తున్న ఫొటోలు తీస్తే సంబర పడ్డారు.. అదే జగన్‌కు తమకు నచ్చని నాయకుడు కట్టిన ఫ్లెక్సీలు చింపేస్తున్న ఫొటోలు తీస్తుంటే దాడులకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందరు విలేకరులతో పాటే ఆస్పరి ఆంధ్రజ్యోతి విలేకరి జె.శివకేశవ్ మంత్రి తనయుడు, తమ్ముళ్లు నిర్వహించిన సీఎం జగన్ జన్మదిన వేడుకలు కవర్ చేసేందుకు వెళ్లాడు. ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్న ఫొటోలను తీస్తున్న శివకేశవ్‌పై మంత్రి అనుచరులు దాడులకు పాల్పడ్డారు.
విచక్షణ కోల్పోయి దాడి
మంత్రి జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్, తమ్ముళ్లు నారాయణ, శ్రీనివాసులు సమక్షంలోనే ఆంధ్రజ్యోతి విలేకరి శివకేశవ్‌పై మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా మీదపడి చేతులు కాళ్లతో ఇష్టానుసారంగా తన్నారు.. పిడిగుద్దులు గుద్దారు. కాళ్లును పట్టుకొని పురితిప్పారని బాధిత విలేకరి శివ తెలిపాడు. ఈ దాడిలో మెడపై గాయాలయ్యాయి. ఎడమ చెవిపై బలంగా కొట్టడంతో దెబ్బలు తిగిలి వినికిడి సమస్యలు తలెత్తాయి. పొత్తికడుపు, వీపుపై బయటకు కనిపించని గాయాలు అయ్యాయని, శరీరం మొత్తం నొప్పులు వచ్చాయని బాధిత విలేకరి వాపోయారు. ఎస్‌ఐ వరప్రసాద్, పోలీసులు అక్కడే ఉన్నా వారి సమక్షంలోనే దాడులకు తెగబడటం విమర్శలు వెల్తువెత్తున్నాయి. జరిగిన ఘటనపై స్థానిక విలేకరులతో కలసి బాధిత రిపోర్టర్ శివకేశవ్ ఎస్‌ఐ వరప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుడిని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షనలో చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి శివపై దాడిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఖండించారు. మండల అధ్యక్ష కార్యదర్శలు శ్రీనివాసులు, మురళి, సీనియర్ నాయకులు వెంకటేశ్, నాగన్న, రూబీన్, లక్ష్మన్న, శ్రీను, మోహన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఏపీయూడబ్ల్యూజే నిరసన
ఆస్పరి ఆంధ్రజ్యోతి విలేకరి శివకేశవ్‌పై మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా అంతటా ధర్నాలు చేశారు. కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహాం వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఽధర్నా చేశారు. మంత్రి జయరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి జర్నలిస్టులకు రక్షణ కల్పించమని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం అడిషినల్ ఎస్పీ సర్కార్‌ను కలసి విలేకరిపై దాడికి పాల్పడిన మంత్రి జయరాం అనుచరులు, ప్రొత్సహించిన మంత్రి తనయుడు ఈశ్వర్, తమ్ముళ్లు నారాయణ, శ్రీనివాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) సభ్యులు కె.నాగరాజు, జి.కొండప్ప, ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షుడు సుబ్బయ్య, గౌరవ సలహదారుడు కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈఎన్ రాజు, శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌చార్జి చల్లా నవీన్‌కుమార్ నాయుడు, ఏబీఎన్ స్టాఫ్ రిపోర్టర్ సుంకన్న, ఎలక్ర్టానిక్ మీడియా ఆసోషియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంజి, ఏపీయూడబ్ల్యూజే నాయకులు హుశేన్, సుంకన్న, దస్తగిరి, శివ, సిటీ కేబులు సూరి, కమలాకర్, లక్ష్మన్న, మోహన్, శ్రీనివాసులు, ఫొటో గ్రాఫర్ రఫీ, వీడియో గ్రాఫర్ నాగేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆలూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్వంలో ధర్నాలు చేశారు. ఆస్పరి ఆంధ్రజ్యోతి విలేకరి శివపై మంత్రి జయరాం అనుచరులు దాడికి పాల్పడడం అప్రజాస్వామ్యమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, నాగేంద్రలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.