కర్నూలంతా కడపోళ్లే..!
ABN , First Publish Date - 2023-05-26T00:29:50+05:30 IST
హైదరాబాద్‌లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఒకరు తన మిత్రుడి ఇంట్లో ఫంక్షన్‌కు కుటుంబంతో సహా కర్నూలుకు వచ్చాడు.

నగరంలోని లాడ్జీలకు డిమాండ్
అన్నింటా వైసీపీ కార్యకర్తలే
అవినాశ్ కోసం తరలివచ్చిన అనుచరులు
హైదరాబాద్‌లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఒకరు తన మిత్రుడి ఇంట్లో ఫంక్షన్‌కు కుటుంబంతో సహా కర్నూలుకు వచ్చాడు. బుధవారం రాత్రి బస చేసేందుకు రాజ్‌విహార్ కూడలి పరిసరాలలో ఉన్న ప్రధాన లాడ్జీలకు వెళితే నో రూమ్స్ అనే సమాధానం ఇచ్చారు. ఏ లాడ్జీకి వెళ్లినా అదే సమాధానం. మిత్రుడి సలహాతో దాదాపు వంద కిలోమీటర్లు దూరంలో ఉన్న మంత్రాలయానికి వెళ్లాడు. కర్నూలు నగరానికి కొత్తవాళ్లు ఎవరొచ్చినా ఇదే పరిస్థితి.
కర్నూలు, మే 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరం కడపమయమైంది. కడప జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు, ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులతో నగరంలోని పలు లాడ్జీలన్నీ నిండిపోయాయి. ఎక్కడ చూసినా కడప, పులివెందుల యాసతో మాట్లాడేవారే కనిపిస్తున్నారు. గాయత్రి ఎస్టేట్ ఏరియాలో కనిపించే ప్రతి పదిమందిలో ఐదారుగురు కడప జిల్లాకు చెందిన వారే కనిపిస్తున్నారు. సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కర్నూలులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. తన తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం కోసం అవినాశ్ గాయత్రి ఎస్టేట్‌లోని విశ్వభారతి ఆసుపత్రిలోనే గత ఐదు రోజులుగా ఉంటున్నారు. ఆయన్ను ఎలాగైనా అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు ఎదురు చూస్తున్నారు. అరెస్టును అడ్డుకునేందుకు అవినాశ్ రెడ్డి అనుచరులు, కడప జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు వేలాదిగా కర్నూలుకు తరలివచ్చారు.
నగరంలో కలెక్టరేట్, గాయత్రి ఎస్టేట్, రాజ్‌విహార్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్, బళ్లారి చౌరస్తా, వైఎస్‌ఆర్ కూడలి ప్రాంతాల్లో చిన్నాపెద్ద లాడ్జీలు వందకు పైగా ఉన్నాయి. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వివిధ పనుల కోసం పలువురు నిత్యం కర్నూలుకు వస్తుంటారు. అనుకున్న పనులు పూర్తికాకపోతే రాత్రి బస చేసేందుకు ఉన్న ఏకైక అవకాశం లాడ్జీలే. గత శుక్రవారం సాయంత్రం అవినాశ్ తల్లి లక్ష్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌ను సీబీఐ అధికారులు సోమవారం ఏ క్షణమైనా అరెస్టు చేసే అకాశం ఉందని, ఎలా ఆరెస్టు చేస్తారో చూస్తామంటూ అడ్డుకునేందుకు ఆదివారం రాత్రే కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులను తరలించారు. ఆ రోజు నుంచి కడప వైసీపీ కార్యకర్తలు, అవినాశ్‌రెడ్డి అనుచరులతో లాడ్జీలు నిండిపోయాయి. ఇద్దరు ఉండాల్సిన గదుల్లో నాలుగైదుగురు ఉంటున్నారని, అదనపు అద్దె అడిగితే దబాయిస్తున్నారని ఓ లాడ్జీ మేనేజరు ఆవేదన వ్యక్తం చేశాడు. అదే క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొత్త వ్యక్తులు రాత్రి బస చేసేందుకు లాడ్జీల్లో గదులు దొరక్క వెనుదిరుగుతున్నారు. కార్లు ఉన్నవాళ్లు నంద్యాల, మంత్రాలయం ప్రాంతాలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి ఉదయం ఆఫీసుల సమయానికి, ఫంక్షన్ ముహుర్తం సమయానికి కర్నూలుకు చేరుకుంటున్నారు.