గిట్టుబాటు ధర కల్పించాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:44 PM
ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు పొలంలోనే నిరసనకు దిగారు.
పొలంలోనే ఉల్లి రైతుల నిరసన
కోసిగి, డిసెంబరు 17: ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు పొలంలోనే నిరసనకు దిగారు. పది రోజుల క్రితం గిట్టుబాటు ధర లభించటంతో సంతోషం వ్యక్తం చేసిన రైతులు నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఆందోళనకు దిగారు. ఆదివారం కోసిగిలోని పులికనుమ ప్రాజెక్టు సమీపంలోని రైతులు కొండగేని వీరారెడ్డి, ఎరిగేరి సిద్ధయ్య, కురువ ఈరమ్మ, బుల్లి లక్ష్మన్న, అల్లయ్య ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా రైతులు తమ పొలాల్లోనే నిరసన వ్యక్తం చేశారు. దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశామని, పది రోజుల క్రితం క్వింటం ధర రూ.4,500 ఉండేదని, నాలుగు రోజుల నుంచి క్వింటం రూ.1,600 నుంచి రూ.1,800కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల దాకా ఖర్చు పెట్టామని, గిట్టుబాటు ధర కల్పించకపోతే అప్పులే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్వింటానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.