ఆవుల మందపై పెద్దపులి దాడి
ABN , First Publish Date - 2023-07-21T23:25:04+05:30 IST
ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామం నుంచి శుక్రవారం మేతకు వెళ్ళిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఓ ఆవు మృతి చెందింది.
ఆత్మకూరు రూరల్, జూలై 21: ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామం నుంచి శుక్రవారం మేతకు వెళ్ళిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఓ ఆవు మృతి చెందింది. కొట్టాల చెరువు గ్రామానికి చెందిన గురువయ్య అనే కాపరి ఆవుల మందను తీసుకుని శుక్రవారం నల్లమల అడవిలో మేపేందుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక ఆవు అక్కడిక్కడే మృతి చెందింది. కాగా అక్కడి కుక్కలు మొరగడంతో పులి ఆవును వదిలేసి వెళ్లి పోయిందని కాపరి తెలిపారు. అలాగే చిన్న అనే మరో పశువుల కాపరి గురువారం ఆవుల మందతో అడవిలోకి వెళ్లి అనారోగ్యంగా ఉన్న ఓ ఆవును చెట్టుకు కట్టేసి మిగిలిన ఆవులను మేపేందుకు తోలుకొని వెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేసరికి చెట్టుకు కట్టేసిన ఆవు కనిపించలేదు. శుక్రవారం దాని కోసం నల్లమలలో గాలించారు. ఓ ప్రాంతంలో ఆవు కళేబరం లభించింది. అక్కడ పెద్దపులి అడుగు జాడలు కనిపించాయి. ఈ వివరాలను అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.