పురపాలక ఆదాయానికి గండి

ABN , First Publish Date - 2023-03-25T23:19:51+05:30 IST

ఆదోని పురపాలకానికి ప్రధాన ఆదాయ వనరు అయిన మార్కెట్ల వేలాలు శనివారం తూతూమంత్రంగా సాగాయి. ప్రతి యేడాది ఆదాయం పెరగాల్సిన చోట తగ్గుతూ పురపాలక కేంద్రానికి నష్టం కలుగుతోంది.

పురపాలక ఆదాయానికి గండి

తూతూమంత్రంగా మార్కెట్‌ వేలంపాటలు

ఆదోని టౌన, మార్చి 25: ఆదోని పురపాలకానికి ప్రధాన ఆదాయ వనరు అయిన మార్కెట్ల వేలాలు శనివారం తూతూమంత్రంగా సాగాయి. ప్రతి యేడాది ఆదాయం పెరగాల్సిన చోట తగ్గుతూ పురపాలక కేంద్రానికి నష్టం కలుగుతోంది. నాయకుల అండతో కొందరు తక్కువ కాంట్రాక్టులను చేక్కించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగానే అధికార పార్టీ నేతలు కొందరు వాటిని దక్కించుకునేందుకు సిండికేట్‌గా మారి వేలాలు పాడారు. అంతా అధికార పార్టీ కనుసన్నల్లోనే జరగడం విశేషం. ఽ

ధరలు పెంచినా దక్కని ప్రతిఫలం::

వివిధ మార్కెట్లలో కాంట్రాక్టర్లు వసూలు చేయాల్సిన రుసుమును అధికారులు పెంచినా, పుర ఆదాయం మాత్రం పెరగకపోవడం విశేషం. వేలాలను ప్రారంభించక ముందే పెంచిన రుసుముల గురించి కాంట్రాక్టర్లకు వివరించాల్సిన అధికారులు, నేరుగా వేలాలను ప్రారంభించడంతో పుర ఆదాయం తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తగ్గిన హోల్సేల్‌ మార్కెట్‌ ఆదాయం జేయల్‌బీ మార్కెట్‌కు సంబంధించిన హోల్సేల్‌ మార్కెట్‌ను అగ్రికల్చర్‌ మార్కెట్‌ యార్డుకు తరలించడంతో అక్కడ వసూళ్లకు అవకాశం లేకుండా పోయిందని, తమ ఆదాయం తగ్గిపోతుందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌ నుండే తమకు ఆదాయం అధికంగా లభిస్తోందని, అది కాస్తా తగ్గిపోవడంతో తక్కువ మొత్తానికి వేలం పాడాల్సి వచ్చిందని కాంట్రాక్టర్లు అంటున్నారు.

గెజిట్‌ ప్రకారం రుసుములను వసూలు చేయాల్సిన కాంట్రాక్టర్లు అంతకుమించి వసూలు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లు రూ.లక్షలు సంపాదింంచుకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వివిధ మార్కెట్ల వేలాలు నుంచి లభించే ఆదాయంతోనే పట్టణంలో అభివృద్ధి పనులకు అవకాశం ఉన్న కారణంగా, అధికారులు మార్కెట్ల వేలాలతోనే సిండికేట్లకు అవకాశం లేకుండా ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2023-03-25T23:19:51+05:30 IST