అక్రమ అరెస్టులపై అలుపెరుగని పోరాటం

ABN , First Publish Date - 2023-10-04T00:24:54+05:30 IST

అక్రమ అరెస్టులపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తామని టీడీపీ నాయకులు అన్నారు.

అక్రమ అరెస్టులపై అలుపెరుగని పోరాటం
డోన్‌: దీక్షలో కూర్చున్నవారికి నల్ల కండువా వేస్తున్న సుబ్బారెడ్డి

అక్రమ అరెస్టులపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తామని టీడీపీ నాయకులు అన్నారు. చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ మంగళవారం దీక్షలు కొనసాగించారు. వైసీపీ తీరును ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని వారు అన్నారు. టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓడిపోతామన్న భయంతోనే సీఎం జగన్‌, వైసీపీ నాయకులు రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఆపలేరని అన్నారు.

బనగానపల్లె, అక్టోబరు 3: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నియోజకవర్గంలోని టీడీపీ బలిజ సంఘం ఆధ్వర్యంలో బనగానపల్లెలో నిరసన దీక్షలో పాల్గొన్నారు. కాపు బలిజసంఘం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ దంతెల రమణ, శివుడు, అందెరాము, గుల్లదుర్తి రాముడు, నొస్సం వెంకటసుబ్బారెడ్డి, కుమారస్వామి, గోవిందిన్నె మఽధు తదితరులు బీసీతో పాటు దీక్షలో కూర్చున్నారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టి సీఎం జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ తనలాగే చంద్రబాబు కూడా జైలు జీవితం గడపాలన్న దురుద్దేశంతో అక్రమ కేసులు పెట్టారన్నారు. పలు అధికార వ్యవస్థలు సీఎం జగన్‌కు తొత్తులుగా మారాయని ఆరోపించారు. టీడీపీని బలహీన పరచడానికి నారా లోకేశ్‌పై కూడా అక్రమంగా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనవన్నారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించి ఎలాగైనా మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. దీక్షలు చేపట్టిన వారికి పలువురు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ కొలిమిగుండ్ల కన్వీనర్‌ నంద్యాల రామేశ్వరరెడ్డి, బురానుద్దీన్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాశీంబాబు, రాయలసీమ సలాం, అల్తాఫ్‌ హుస్సేన్‌, పూలకలాం, మంగంపేట శ్రీను, లాయర్‌ నాగేంద్రారెడ్డి, అమరనాథరెడ్డి తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.

డోన్‌: టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు వచ్చే దాకా పోరాడతామని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో బాబుతో నేను నిరాహార దీక్షలో నల్లమేకలపల్లి గ్రామ నాయకులు కూర్చున్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి చేయకపోగా.. ప్రజలపై అన్ని భారాలు మోపి ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. వైసీపీ అరాచక విధానాలతో రాష్ట్రం ఎంతో నష్టపోవాల్సి వచ్చిందన్నారు. వైసీపీ అవినీతిని, అరాచకాలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో జగన్‌ కక్షగట్టి అక్రమ కేసులతో జైలులో నిర్బంధించారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మాజీ ఎంపీపీ ఆర్‌ఈ రాఘవేంద్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, బీసీ సెల్‌ జిల్లా అద్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, యువ నాయకులు ధర్మవరం గౌతమ్‌ రెడ్డి, జలదుర్గం విష్ణు, రాజశేఖర్‌ నాయుడు, బట్టా సత్యం, భువనేశ్వర్‌ నాయుడు, నరసయ్య, బాల నరసింహులు, వెంకటరంగయ్య పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ: మాజీ సీఎం చంద్రబాబు వెన్నంటే నడుస్తామని శిరివెళ్ల పట్టణ టీడీపీ నాయకులు యామా గురప్ప, సూరారామ అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు మంగళవారం శిరివెళ్ల పట్టణ టీడీపీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే మాజీ సీఎం చంద్రబాబుపై సీఎం జగన్‌ అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. దీక్షలో మురళి, మహమ్మద్‌ హుసేన్‌, ఉల్లి వెంకట సుబ్బయ్య, శ్రీను, నాలివలి, రసూల్‌, లింగమయ్య, బాలజోజి, శేఖర్‌, రాజు పాల్గొన్నారు.

చాగలమర్రి: రాష్ట్రంలో రాక్షస పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా అన్నారు. మంగళవారం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చాగలమర్రి టీడీపీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, టీడీపీ నాయకులు కొలిమి ఉసేన్‌వలి, మౌళాలి, అనీఫ్‌, అక్బర్‌, సుబ్బారావు, మదార్‌సా, రమేష్‌, ఖాజారసూల్‌, గఫార్‌, ఇమామ్‌ హుసేన్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

బేతంచెర్ల: బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా బేతంచెర్ల టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ 500 లెటర్లను పోస్టుకార్డు రూపంలో మద్దతు తెలుపుతూ పోస్టు చేశారు. యువత ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, పట్టణ బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గమైన చర్య అని పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి అన్నారు. మంగళవారం బేతంచెర్ల నగర పంచాయతీ డైవర్స్‌ కాలనీలో పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి ఆధ్వర్యంలో బాబుతో నేను అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. కౌన్సిలర్‌ రామగోపాల్‌, నంద్యాల మధు, వంశీకృష్ణ, ఫయాజ్‌, లోకేశ్‌ గౌడు, నారాయణ స్వామి, గిడ్డమ్మ, కానాల అంజి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-04T00:24:54+05:30 IST