జల జీవం లేని మిషన

ABN , First Publish Date - 2023-03-25T23:29:42+05:30 IST

ఇటీవల జలజీవన మిషన బృంద సభ్యులు జిల్లాకు వచ్చారు.

జల జీవం లేని మిషన

రెండున్నరేళ్లైనా టెండర్‌ దాటని పనులు

కేంద్రం నిధుల నుంచి కూడా బిల్లులు చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం

ముందుకు రాని కాంట్రాక్టర్లు

నంద్యాల, ఆంధ్రజ్యోతి: ఇటీవల జలజీవన మిషన బృంద సభ్యులు జిల్లాకు వచ్చారు. జలజీవన మిషనలో భాగంగా డోనలో చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లెక్కన జలజీవన మిషన పనులు జిల్లాలో చాలా బాగా జరుగుతున్నాయనుకుంటే పొరబాటే! జిల్లాలో ఒక్క డోన నియోజవర్గం మినహా ఎక్కడా వీటి పనులు సాగడం లేదు. ఈ పథకం మొదలు పెట్టి దాదాపు రెండున్నరేళ్లు కావస్తున్నా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. అసలు కొన్ని పనులు టెండరు దశను కూడా దాటలేందంటే.. అఽధికార పార్టీ చిత్తశుద్ధి, అధికారులు పనీతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పనులు ఇలా ఉండగా, బృంద సభ్యులకు మాత్రం ‘జిల్లాలో జలజీవన మిషన పనులు సక్రమంగా నడుస్తున్నాయి’ అని చూపించడమంటే.. అధికారులను, ప్రజలను మోసం చేయడమేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 2020 అక్టోబరులో ‘జల్‌ జీవన మిషన’ ప్రారంభించాయి. 2024 కల్లా వీటి పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించాయి. జిల్లా వ్యాప్తంగా మిషనకు సంబంధించి మొదటి దశలో 380, 2021-22 సంవత్సరానికి 148 పనులు చేపట్టారు. దీని కోసం రూ.116.30 కోట్లు కేటాయించారు. 2022-23 సంవత్సరంలో 554 పనులు చేపట్టగా, 177.47 కేటాయించారు. మొత్తం 293.77 కోట్లు. వీటిలో సగభాగం అంటే దాదాపు రూ.146.88 కోట్లు కేంద్రమే ఇస్తుంది. అయినా జిల్లాలో పనులు ముందుకు సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను అందించినా జిల్లాలో జలజీవన మిషన పనులు పూర్తి చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. మొత్తం పనులను ఒకేసారి పూర్తిచేయలేక విడతల వారీగా పనులు చేపట్టింది. అయితే వీటికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించడంతో సక్రమంగా సాగడం లేదు. మొదటి దశలో చేపట్టిన పనుల్లో దాదాపు 248 పనులు ఇంకా అగ్రిమెంటు కూడా కాలేదు దీన్నిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక 2022-23 సంవత్సరానికి సంబంధించి పనులు కూడా చాలా వరకు టెండరు దశను దాటలేదు. జిల్లా వాసులు తాగునీటి కష్టాలను తీర్చే పథకంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించే పనులు చేపట్టడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందు వరుసలో ఉంటాయి. నిధుల భారం తగ్గడమే కాకుండా, పథకానికి సంబంధించి క్రెడిట్‌ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకే వస్తుంది కాబట్టి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాయి. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ అవకాశాన్ని కూడా అంది పుచ్చుకోలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి మరీ పనులు చేయమంటే పథకం అమలుకి ఆపసోపాలు పడుతోందన్న అభిప్రాయం వనిపిస్తోంది.

ఫ ఆరెడుసార్లు పిలిచినా..

జల్‌ జీవన మిషన కింద జిల్లా వ్యాప్తంగా 1,082 పనులు శాంక్షన అయ్యాయి. ఈ పనులు ఆయా గ్రామాల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్లను అందించేందుకు వీలుగా నామినేటెడ్‌, టెండర్‌ పనులు అంటూ విభజించారు. వీటిలో రూ.5 లక్షల లోపు ఖర్చయ్యే పనులను నామినేటెడ్‌ పనుల కిందకు, రూ.5 లక్షలకు పైన ఖర్చయ్యే పనుల టెండర్‌ విభాగం కిందకు వస్తాయి. జిల్లాలో మొదటి దశకు సంబంధించి నామినేటెడ్‌ పనులు 51 ఉండగా, రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షలకు మధ్యలో పనులు 427, రూ.40 లక్షల నుంచి రూ.2 కోట్ల పనులు 49, రూ.2 కోట్లకు పైగా పనులు ఒకటి ఉన్నాయి. వీటిలో నామినేటెడ్‌ పనులు మొత్తం మాత్రమే పూర్తయ్యాయి. మిగతా వాటిలో రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షలకు సంబంధించి 217, రూ.2 కోట్ల లోపు పనులు 30, రూ.2 కోట్లకు పైగా ఉన్న ఒక్క పనికి ఇంకా అగ్రిమెంట్లు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించి టెండర్లను అధికారులు ఇప్పటికే ఆరేడు సార్లు పిలిచారు. అయినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైంది. గతంతో చేసిన కాస్త పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు జలజీవన మిషన పనులంటేనే ఆమడ దూరం పరిగెత్తుతున్నారు. దీంతో పనులు అనుకున్న కాలానికి పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. కేంద్రం కేటాయించిన నిధుల వరకు మాత్రమే ఖర్చు పెట్టినా ఇప్పటి వరకు జలజీవన మిషన పనులు సగం మేర పూర్తయ్యేవని, కేవలం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక 2022-23 సంవత్సరానికి 554 పనుల్లో కొన్నిటికి మాత్రమే అగ్రిమెంట్లు అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

ఫ అధికారుల నిర్వాకం..

జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన ఇచ్చే విధంగా చేపట్టిన జలజీవన మిషన కేంద్ర ప్రభుత్వ వాటాతో జరుగుతోంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ బృంద సభ్యులు జిల్లాలో జరుగుతున్న పనుల తీరును పరిశీలించడానికి వస్తుంటారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత కేటాయించిందనే విషయాన్ని ఆరా తీస్తుంటారు. వారు వచ్చే సమయానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సమానంగా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఆమేరకు పనులు చేయించాలి. లేనిపక్షంలో బృంద సభ్యులకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సమాధానం చెప్పాల్పి ఉంటుంది. ఇక్కడే అధికారులకు పెద్ద చిక్క వచ్చి పడింది. దాదాపు మూడేళ్ల నుంచి జిల్లాకు కేటాయించిన పనుల్లో సగం కూడా పూర్తయిన దాఖలాలు లేవు. అంతో ఇంతో జలజీవన మిషన కింద డోనలో చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పనులు మాత్రమే సాగుతున్నాయి. దీంతో అధికారులు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు డోన వాటర్‌ గ్రిడ్‌ పనులను చూపెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే.. జలజీవన మిషన అధికారులను తప్పు దారి పట్టించకుండా ఇంటింటికీ కుళాయి కనెక్షన ఇచ్చే పనులు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫ సకాలంలో చెల్లించకపోవడంతోనే..

జిల్లాలో మొత్తం మొదటి దశ పనులను 2020లో శాంక్షన చేశారు. అయితే ఆ సంవత్సరం నవంబరు నుంచి మార్చి వరకు పెద్దగా పనులు జరగలేదు. ఇక ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఆ పనులను మరుసటి ఆర్థిక 2021-22వ సంవత్సరం పనులతో కలిసి చేపట్టారు. ఇక 2021-22కు సంబంధించి మరికొన్ని పనులు శాంక్షన అయ్యాయి. ఈ పనులకు రూ.293 కోట్లకు పైగా కేటాయించారు. ఈ పనులన్నీ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తాయి కాబట్టి బిల్లులు వెంటవెంటనే విడుదలవుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకు వస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను కూడా కాంట్రాక్టర్లకు చెల్లించడం లేదు. దీంతో జలజీవన మిషన పనులకు కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ ప్రభావం టెండర్‌ విధానానికి సంబంధించిన పనుల మీద పడుతోంది. కొంతమంది కాంట్రాక్టర్లు ధైర్యం చేసి ముందుకు వచ్చినా అగ్రిమెంట్లు చేసుకోవడానికి జంకుతున్నారు. దీంతో జలజీవన మిషన పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టెండరు దశలోనే

నందికొట్కూరు, మార్చి 25:

నాలుగు మండలాలోన్లి 61 గ్రామాల్లో రూ.18.39 కోట్లతో జలజీవన మిషన పనులకు పరిపాలన అనుమతులు రావడంతో టెండర్‌ దశకు చేరుకున్నాయి.

ఫ పగిడ్యాల మండలంలోని 8 గ్రామాల్లో రూ.3.71 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. టెండర్ల దశలో ఉన్నాయి.

ఫ జూపాడు బంగ్లా మండలంలోని 17 గ్రామాల్లో రూ.4.40 కోట్లతో ప్రతిపాదనలు పూర్తికాగా... టెండర్‌ దశలో ఉన్నాయి.

ఫ మిడ్తూరు మండలంలో 24 గ్రామాల్లో రూ.5.64 కోట్లతో ప్రతిపాదనలు పూర్తి కాగా.. టెండర్‌ దశలోనే ఉన్నాయి.

ఫ నందికొట్కూరు రూరల్‌ 12 గ్రామాల్లో రూ.4.58 కోట్లతో ప్రతిపాదనలు పూర్తికాగా.. టెండర్‌ దశలోనే ఉన్నాయి.

బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలోని 5 మండలాల జలజీవన మిషన పథకం కింద ఫేజ్‌ 1 కింద 56 జీవో నంబర్‌ ప్రకారం 2020లో రూ. 219 పనులకుగాను రూ. 47.56 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 2021లో పనులు ప్రారంభం అయ్యాయి. టెండర్లు పూర్తి అయి 60 శాతం పనులు పూర్తయ్యాయి. చాలా చోట్ల నత్త నడకన సాగుతున్నాయి. కారణం గత 6 నెలలుగా బిల్లులు సక్రమంగా అందకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్లు పనులు చేయడానికి సిద్థంగా ఉన్నా బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మాణం పనులు చాలా చోట్ల ప్రారంభం కాకపోవడంతో ఇంకా పనులు ప్రారంభించలేదు. 918 జీవో ప్రకారం ఫేజ్‌ 2 కింద 5 మండలాలకు సంబంధించి జలజీవన మిషన కింద 79 పనులకు గాను 25.99 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు సంబంధించి టెండర్‌లు పూర్తి కాలేదు. త్వరలో టెండర్లు పూర్తి అయితే పనులు ప్రారంభమవుతాయి.

Updated Date - 2023-03-25T23:29:42+05:30 IST