ఉద్యమ హోరు
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:56 AM
ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు అమలు ఉద్యోగులు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. తమ బతుకులు బాగుంటాయని వైసీపీకి ఓటు వేస్తే బజారున పడేశారని ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్వత్రా నిరసనలు
జగన్ పాలనపై ఉద్యోగుల అసహనం
అంగన్‌వాడీ మహిళల శాపనార్థాలు
క్లాప్ డ్రైవర్ల నిరసన గళం
పారిశుధ్య కార్మికులు, మెప్మా రీసోర్స్‌పర్సన్ల ధర్నాలు
ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల పోరుబాట
ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు అమలు ఉద్యోగులు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. తమ బతుకులు బాగుంటాయని వైసీపీకి ఓటు వేస్తే బజారున పడేశారని ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నారు. ఉద్యోగులు, కార్మికులు, అంగన్‌వాడీలు, డ్రైవర్లు, ఇలా అందరూ రోడ్డెక్కారు. నాలుగేళ్లుగా ఒత్తిడిని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే నిరసన గళం విప్పుతున్నారు. ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నిరంకుశ ప్రభుత్వాన్ని అణచివేస్తామంటూ గర్జిస్తున్నారు. క్లాప్ డ్రైవర్లు, మెప్మా రీసోర్స్ పర్సన్లు ధర్నాలతో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. వీరికి తోడుగా నిరుద్యోగులు సైతం ఉద్యమబాట పట్టారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ అంగన్‌వాడీలు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. కనీసం వేతనం చెల్లించాలని కోరుతూ రెవెన్యూ శాఖలోని వీఆర్‌ఏలు ఆందోళన బాట పట్టారు. వీరందరూ దాదాపుగా ఒకే రకమైన డిమాండ్ల సాధన కోసమే పోరుబాట పట్టారు. మరోవైపు భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ ఆందోళనలకు కార్మిక, కర్షక, విద్యార్థి సంఘాలతో పాటు టీడీపీ, జనసేన, వామపక్ష, పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం బాధాకరం.
హామీలు ఏమయ్యాయి జగన్..?
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 30: ఆడుదాం ఆంధ్ర కాదు జగన్ రెడ్డి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎక్కడ సీఎం జగన్..? అని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.సోమన్న, ఎస్.సాబీర్ బాషా నిలదీశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని ఉద్యోగులు, నిరుద్యోగులు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ధర్నా చేశారు. రాష్ట్రంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. దాని తీవ్రతను తగ్గించేందుకే ఆడుదాం ఆంధ్రా క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఎన్నిచేసినా నిరుద్యోగులు ఇక జగన్‌ని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎప్ నాయకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
కదం తొక్కిన కార్మికులు
కర్నూలు(న్యూసిటీ): డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు శనివారం కదం తొక్కారు. నగరంలోని నకార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మద్దిలేటి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నా కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎన్నికల ముందు లేనిపోని హామీలను ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని ఎద్దేవ చేశారు. అనంతరం మెడికల్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మునిన్పపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులగం మద్దిలేటి, ఏఐటీయూసీ జిల్లా, నగర కార్యదర్శులు ఎస్.మునెప్ప, జి.చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, ఏసన్న, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
క్లాప్ డ్రైవర్ల సమ్మె
క్లాప్ ఆటో డ్రైవర్ల పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ నగర నాయకులు దూదేకుల కుమార్ డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని నాలుగు రోజులుగా కార్పొరేషన్ ఎదుట సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. డ్రైవర్లకు జీతాలు చెల్లించకుంటే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘుశేఖర్, మద్దిలేటి, కృష్ణ, పరమేష్ పాల్గొన్నారు.
జగన్ ప్రభుత్వంపై ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల ఆగ్రహం
కర్నూలు(ఎడ్యుకేషన్): డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్‌లో శనివారం జేఏసీ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. నల్లరిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని ఉద్యోగులు నిరసన తెలియజేశారు. 12 రోజుల నుంచి ఆందోళనలు, నిరసనలు, తెలియజేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుందని ఆరోపించారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే తమ సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు, జేఏసీ నాయకులు చంద్రశేఖర్‌రాజు, మహమ్మద్ రఫీ, గౌరవాధ్యక్షుడు జయనాగేశ్వరరావు, కార్యదర్శి రంగన్న, భాస్కర్, శంకర్, రమణ, వెంకట్రాముడు, మధు, మోహన్, నాగరత్నమ్మ పాల్గొన్నారు.
సీఎం జగన్‌కు పోస్ట్‌కార్డులు
కర్నూలు(కల్చరల్), డిసెంబరు 30: అంగన్‌వాడీలు శనివారం పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. సుమారు 600 మంది అంగన్‌వాడీలు సీఎంకు పోస్టు కార్డులు రాసి తమ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. చంద్రశేఖర్, ఉప కార్యదర్శి టి. రామాంజినేయులు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకరప్ప, విజయ్‌కుమార్‌లు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎస్ మునెప్ప మాట్లాడుతూ అంగన్‌వాడీలు 19 రోజులుగా సమ్మె చేస్తున్నా జగన్ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. అంగన్‌వాడీల ఉద్యమాన్ని అణచి వేయడానికి జగన్‌మోహ న్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించినా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఐటీయూ నాయకుడు అంజిబాబు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలను వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు చులకనగా మాట్లాడుతున్నారని, మూడు నెలలు తర్వాత బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అంగన్‌వాడీలకు జీతాలు పెంచమంటే డబ్బు లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంగన్‌వాడీలకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఈఎన్ రాజు, శ్రీనివాస్‌గౌడ్, ఐజేయూ నాయకులు గోరంట్ల కొండప్ప, నాగరాజులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పీఓపీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, ఏపీ మున్సిపల్ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి పి. మద్దిలేటి, మాణ్యిం, బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ వరుణ్‌యాదవ్ తదితరులు తమ మద ్దతు తెలియజేశారు.
మెప్మా ఆర్పీల మెరుపు ధర్నా
కర్నూలు(న్యూసిటీ): మెప్మాలో పని చేస్తున్న రీసోర్స్ పర్సన్లు సమ స్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. తమకు ఉద్యోగ భద్ర త కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట ఆర్పీలు ధర్నా చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు, ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు రుద్రమ్మ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26 వేల వేతనాలు పెంచాలన్నారు. వేతనాలు ఆర్పీల వ్యక్తిగత ఖాతాలో జమచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.8 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి ఉమాదేవి, నాయకులు వెంకటేశ్వర్లు, శ్యామల, షబానా, పర్వీన్‌కుమారి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.