Female constable : దొంగపోలీస్‌

ABN , First Publish Date - 2023-03-31T03:34:12+05:30 IST

వ్యాపారులు బిల్లులు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్న 105 కిలోల( రూ.75 లక్షల విలువైన) వెండి ఆభరణాలపై ఓ మహిళా కానిస్టేబుల్‌ కన్నుపడింది.

 Female constable : దొంగపోలీస్‌

స్టేషన్‌లో రూ.75 లక్షల వెండి మాయం

రాత్రిపూట మహిళా కానిస్టేబుల్‌ చోరీ

మరో కానిస్టేబుల్‌ సాయంతో తరలింపు

వెండి నగలు కరిగించి బంగారం కొనుగోలు

రెండేళ్ల క్రితం ఆ వెండి నగలు సీజ్‌

యజమానులు రావడంతో

చోరీ ఘటన వెలుగులోకి

కర్నూలు, మార్చి 30: వ్యాపారులు బిల్లులు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్న 105 కిలోల( రూ.75 లక్షల విలువైన) వెండి ఆభరణాలపై ఓ మహిళా కానిస్టేబుల్‌ కన్నుపడింది. మరో కానిస్టేబుల్‌ సాయంతో వాటిని మాయం చేసింది. కర్నూలు తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన అసలు యజమానులు నగల కోసం రావడంతో వెలుగు చూసింది. త్వరలో ఆ మహిళా కానిస్టేబుల్‌ను అరెస్టు చూపే అవకాశం ఉంది. 2021 జనవరి 8న కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలో ఈ ఆభరణాలను సీజ్‌ చేసి తాలుకా పోలీసులకు అప్పగించారు. అప్పటి సీఐ విక్రమసింహ ఆ సొత్తును వాణిజ్య పన్ను శాఖకు అప్పగించకుండా పంచనామా మాత్రమే నిర్వహించారు. కేసు కూడా నమోదు చేయలేదు. పోలీ్‌సస్టేషన్‌లోనే వాటిని ఉంచారు. ఆయన బదిలీ తర్వాత మరో ఇద్దరు సీఐలు మారారు. ప్రస్తుతం రామలింగయ్య సీఐగా ఉన్నారు. తమిళనాడుకు చెందిన ఆ నగల వ్యాపారులు రెండు రోజుల కిందట కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చారు. పోలీ్‌సస్టేషన్‌లో నగలు లేకపోవడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రత్యేక బృందాలతో ఆరా..

ఘటనపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, అదనపు ఎస్పీ, డీఎస్పీ మహే్‌షల ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు, సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పనిచేసిన సీఐలను, రైటర్లను, డబ్బా రైటర్లను, ఏఎ్‌సఐలను అందరినీ కర్నూలు డీటీసీకి విచారణ నిమిత్తం పిలిపించారు. మధ్యలో మధ్యాహ్నం భోజనానికి వెళ్లి ఓ మహిళా కానిస్టేబుల్‌ మినహా అందరూ తిరిగి వచ్చారు. ఆమె ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ కావడంతో వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు. ఇంట్లో కూడా ఆమె లేకపోవడంతో సమీపంలో ఆరా తీశారు. కోడుమూరు సమీపంలో ఆమెతోపాటు ఆమె భర్తను, కోడుమూరులో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 30 తులాలకు పైగా బంగారు నగలు ఆటోలో తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.

గుట్టుచప్పుడు కాకుండా మాయం

కొద్ది నెలల కిందట సెబ్‌ అధికారులు సీజ్‌ చేసిన గంజాయి, మద్యం తదితర వాటిని ధ్వంసం చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. అన్ని పోలీ్‌సస్టేషన్లలో ఉన్న గంజాయి, మద్యం బాటిళ్లను డీటీసీకి తీసుకు రావాలని సూచించారు. తాలుకా పోలీ్‌సస్టేషన్‌లో ఉన్న వాటిని ఆ మహిళా కానిస్టేబుల్‌ ఆధ్వర్యంలో డీటీసీకి తరలించారు. ఈ క్రమంలో బీరువాలో ఉన్న 105 కిలోల వెండి ఆభరణాలను ఆమె గుర్తించారు. ఈ నగలపై కేసు లేకపోవడం, రికార్డుల్లో వివరాలు లేకపోవడం, రెండేళ్లుగా వాటి కోసం ఎవరూ రాకపోవడం, ఎలాంటి పంచనామా రిపోర్టులు లేకపోవడంతో కాజేయాలని భావించారు. పై అంతస్థులో ఉన్న ఆ నగల సంచులను సీఐ గదికి తరలించారు. రెండు రోజుల తర్వాత రాత్రి పూట మరో కానిస్టేబుల్‌ సాయంతో ఆ నగలను ఆటోలో తరలించారు. కర్నూలు నగరంలోని ఓ బంగారు దుకాణంలో వెండి నగలను కరిగించి, 30 తులాల బంగారు నగలు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఖరీదైన కారు కూడా కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. ఆటో డ్రైవర్‌ను, బంగారు దుకాణం యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-03-31T03:34:12+05:30 IST