Share News

అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి

ABN , First Publish Date - 2023-10-30T00:13:08+05:30 IST

హొళగుంద మండల పరిధిలోని బొమ్మ గుండనహళ్లి గ్రామంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి చెందారు.

అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

హొళగుంద, అక్టోబరు 29: హొళగుంద మండల పరిధిలోని బొమ్మ గుండనహళ్లి గ్రామంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి చెందారు. ఎస్సై శ్రీనివాసులు వివరాల మేరకు.. హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన బోయ రాజు (27), హొళగుంద మండలం బొమ్మనహళ్లి గ్రామానికి చెందిన రేణుక (20)ను రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు బెంగళూరుకు వలస వెళ్లి దినసరి కూలీలుగా కొన్ని నెలలుగా జీవనం సాగిస్తున్నారు. దసరా పండుగకు రెండు రోజుల ముందే బొమ్మనహల్లి గ్రామానికి వచ్చారు. పండుగ రోజున దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్పవాలకు సైతం వెళ్లి వచ్చారు. శనివారం రాత్రి భార్యాభర్తలు ఇంట్లోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించగా రేణుక తల్లి ఈర మల్లమ్మ తన తమ్ముడి ఇంటికి వెళ్లి పడుకుంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలైనా కూతురు, అల్లుడు ఇంటిలో నుంచి బయటకు రాకపోవడంతో మల్లమ్మ వెళ్లి తలుపులు కొట్టింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా రాజు ఇంటి పైకప్పునకు చీరతో ఉరివేసుకొని వేలాడుతూ, రేణుక కింద పడిపోయి కనిపించారు. దీంతో మల్లమ్మ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు విగత జీవులుగా మారి ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈర మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-10-30T00:13:08+05:30 IST