ఓర్వకల్లు పరిశ్రమలకు ముచ్చుమర్రి నీరు
ABN , First Publish Date - 2023-06-07T23:34:47+05:30 IST
ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌కు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఏపీఐఐసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారి వెంట పైపులైన
56 కి.మీటర్ల మేర రూ.288 కోట్లతో ఏర్పాటుకు చర్యలు
కాలువ తవ్వకాలు ప్రారంభం
నందికొట్కూరు, జూన 7: ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌కు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఏపీఐఐసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓర్వకల్లు వద్ద పరిశ్రమల హబ్ ఏర్పాటుకు పది వేల ఎకరాలు కేటాయించారు. గుట్టపాడు పొలిమేరలో జయరాజ్ ఇస్పాత ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఒక టీఎంసీ నీటిని పైపు లైన ద్వారా తీసుకువెళ్లనున్నారు. ఆర్ అండ్‌బీ రోడ్డు పక్కన పైప్‌లైన తీసుకువెళ్లేందుకు పనులు ప్రారంభించారు. ఏడు అడుగుల లోతు, 1.8 మీటర్ల వెడల్పు పొడవునా ఈ కాలువను తీస్తున్నారు. ఈ పైపు లైన మొత్తం 56 కి.మీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ పైపు లైన కోసం రూ.288 కోట్లు కేటాయించారు. ముచ్చుమర్రి నుంచి 15 కి.మీటర్ల దూరంలో ఆర్‌అండ్‌బీ అధికారుల నుంచి అనుమతులు పూర్తి స్థాయిలో రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి దిగువకు 300 మీటర్లలో పంపు హౌస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి కేసీ కెనాల్ పైభాగం నుంచి పైప్‌లైనను తీసుకొని ముచ్చుమర్రి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు కుడి వైపు నుంచి ఏర్పాటు చేస్తారు.
56 కి.మీటర్ల మేర పైపులైన
ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు వరకు 56 కి.మీటర్ల మేర భూమి లోపల ఈ పైపులైనను ఏర్పాటు చేయనున్నారు. ముచ్చుమర్రి, కొణిదేల, నాగటూరు, నందికొట్కూరు, బొల్లవరం, బ్రాహ్మణకొట్కూరు, గార్గేయపురం మీదుగా ఆర్‌అండ్‌బీ రోడ్డు, కేజీ రోడ్డు వెంట పైపులైన ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి కేతవరం, పూడిచర్ల మీదుగా గుట్టపాడు పొలిమేరలో నిర్మిస్తున్న జయరాజ్ ఇస్పాత(ఉక్కు పరిశ్రమ) వరకు ఈ పైపులైనను ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారి వెంట భూమి లోపల పైపుల ఏర్పాటుకు భూమిలో రాయి పడితే బ్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడానికి ప్రభుత్వ అనుమతుల కోసం ఏపీఐఐసీ అధికారులు వేచి ఉన్నట్లు తెలుస్తోంది.. ఆయా శాఖల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎలైనమెంట్ కోసం అక్కడక్కడా ఎక్స్‌కవేటర్‌తో తవ్వుతూ అనుమతులు భూ పరీక్ష చేస్తున్నారు. దీంతో కొణిదేల గ్రామ పొలిమేరలోని దేవమల్లప్ప గుడి వద్ద నుంచి కొణిదేల ముచ్చుమర్రి, నెహ్రూనగర్ క్రాస్ వరకు కాలువను తీశారు. అలాగే కొణిదేల, నాగటూరు క్రాస్ నుంచి నందికొట్కూరు సమీపం వరకు కాలువను తవ్వుతున్నారు. భ్రాహ్మణకొట్కూరు వద్ద క్యాంపు ఏర్పాటు చేసి అక్కడ పైపులను నిల్వ చేశారు. ఇక్కడ పైపులకు సిమెంట్ కోటిగ్ వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక పైపులైనను ఏర్పాటు చేయనున్నారు.
ఫ గ్రామాలు పట్టణాల్లో సాధ్యమేనా..?
పైపు లైన ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారి వెంటనే తీసుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొణిదేల, బ్రాహ్మణకొట్కూరు, గార్గేయపురం గ్రామాలతో పాటు నందికొట్కూరు పట్టణంలో రోడ్డుకు సమీపంలోనే ఇల్లు ఉన్నాయి. ఇలాంటి చోట పైప్‌లైన ఎలా తీసుకెళ్తారన్నది ప్రజల్లో చర్చ జరుగుతోంది. పట్టణంలో మంచి నీటి కుళాయి కనెక్షన్లు, డ్రైనేజీలు ఉన్నాయి. వీటి స్థానంలో ఎలా తీసుకెళ్తారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఏపీఐఐసీ జెడ్‌ఎం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పూడిచర్ల గ్రామంలో కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో పైప్‌లైన తీసుకెళ్తున్నామన్నారు. అలాగే అవకాశం ఉన్న ప్రతి చోటా ప్రత్యామ్నాయంగా పైపులైనను తీసుకెళ్తామని చెబుతున్నారు. పట్టణంలో పైపులైన తీసుకెళ్లాలా లేదా అన్న అంశంపై అధికారులతో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.