ఎన్టీఆర్‌ విగ్రహానికి వైసీపీ ఫ్లెక్సీలు

ABN , First Publish Date - 2023-05-27T01:13:45+05:30 IST

పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటు శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్తతకు దారితీసింది.

ఎన్టీఆర్‌ విగ్రహానికి వైసీపీ ఫ్లెక్సీలు

ఎన్టీఆర్‌ విగ్రహానికి దేవినేని అవినాష్‌ పేరిట ఫ్లెక్సీలు

టీడీపీ శ్రేణుల నిరసన.. పెద్దపెట్టున నినాదాలు

వైసీపీ ఫ్లెక్సీలపై టీడీపీ జెండాల ఏర్పాటు

పటమట, మే 26 : పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటు శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని వైసీపీ నేత దేవినేని అవినాష్‌ అనుచరులు తమ నాయకుడి ఫొటోలతో ఉన్న బ్యానర్లను ఎన్టీఆర్‌ విగ్రహం చుట్టూ కట్టారు. ఆగ్రహించిన టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అవినాష్‌ బ్యానర్లపై టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అర్ధరాత్రి వరకూ పటమట సర్కిల్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. జయహో ఎన్టీఆర్‌, డౌన్‌ డౌన్‌ దేవినేని అవినాష్‌ అనే నినాదాలతో మార్మోగిపోయింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు.

ప్రశాంత బెజవాడను కలుషితం చేయొద్దు : ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

విజయవాడలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయొద్దని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవినేని అవినాష్‌ చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారని, పార్టీ జెండాను కిందవేసి తొక్కారని గుర్తుచేశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగిస్తే అవినాష్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగితే ఎన్టీఆర్‌ వైసీపీ ఫ్లెక్సీలేంటన్నారు. ధనబలం, రౌడీయిజంతో ఏమైనా చేయవచ్చంటే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఇలాంటి చర్యలను పోలీసులు నిరోధించలేకపోవడం దారుణమన్నారు. ఇప్పుడైనా మారకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని గద్దె మండిపడ్డారు.

Updated Date - 2023-05-27T01:13:45+05:30 IST