దొంగ ఓట్లతో గెలవాలనే వైసీపీ, జగన్‌ కుట్ర

ABN , First Publish Date - 2023-08-22T01:11:08+05:30 IST

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలన్న కుట్రతో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ పనిచేస్తున్నారని, వలంటీర్ల సమాచారంతో పెద్దఎత్తున నకిలీ ఓటర్లను సృష్టించి, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.

దొంగ ఓట్లతో  గెలవాలనే వైసీపీ, జగన్‌ కుట్ర

పాయకాపురం, ఆగస్టు 21: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలన్న కుట్రతో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ పనిచేస్తున్నారని, వలంటీర్ల సమాచారంతో పెద్దఎత్తున నకిలీ ఓటర్లను సృష్టించి, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న అన్ని నియోజకవర్గాలతో పాటు, మిగిలిన వాటిలోనూ దొంగ ఓట్ల సృష్టిపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఉరవకొండలో దొంగ ఓట్ల నమోదుపై స్థానిక ఎమ్యెల్యే పయ్యావుల కేశవ్‌ చేసిన ఫిర్యాదుపై పరిశీలనకు వెళ్లిన అధికారులు నివ్వెరపోయారని, ఏ రాష్ట్రంలో లేనట్టు వలంటీర్ల సాయంతో టీడీపీ, ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం వారు కనుక్కున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిందన్నారు. దేశవ్యాప్తంగా పకడ్బందీగా ఓటరు జాబితా పరిశీలన, ఓటర్ల వెరిఫికేషన్‌ జరుగుతుంటే, రాష్ట్రంలో మాత్రం సజ్జల నేతృత్వంలో ఆ ప్రక్రియ మొత్తం అపహాస్యం మారిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఓటర్‌ జాబితా పరిశీలన సక్రమంగా జరగకపోవడానికి సజ్జల అతడి నేతృత్వంలో అనధికారిక వ్యవస్థే కారణమని, కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పరిశీలన, బీఎల్‌వోల వెరిఫికేషన్‌ గడువును కొంత కాలం పొడిగించాలని కోరారు.

తప్పు చేసే అధికారులు శిక్షార్హులే..!

సజ్జల రామకృష్ణారెడ్డి అండతో అడ్డగోలుగా వ్యవహరించి భాస్కర్‌రెడ్డి, శోభా స్వరూప ఎమయ్యారో అధికారులు తెలుసుకోవాలన్నారు. ఓటర్లు జాబితాలో అవకతవకలకు పాల్పడితే ఎవరైనా శిక్షార్హులే అవుతారన్నారు. అధికారులెవరైనా అధికార పార్టీ చెప్పిందని అడ్డగోలుగా వ్యవహరించవద్దని సూచించారు. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తి పనిచేస్తే వారి తప్పులన్నీ అక్టోబర్‌ 7న కేంద్ర ఎన్నికల సంఘం వదిలే కొత్త ఓటర్‌ జాబితాలో బయటపడతాయన్నారు. ఇప్పటికే టీడీపీ గ్రామ స్థాయిలో ఓటర్ల జాబితాపై దృష్టిపెట్టిందని, అర్హులైన వారికి ఓట్లు తొలగించడమంటే ప్రజల తీర్పుని అపహాస్యం చేయడమేనని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.

Updated Date - 2023-08-22T01:11:08+05:30 IST