ఎందుకు ఆగిపోయాయి!
ABN , Publish Date - Dec 22 , 2023 | 01:19 AM
వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంటులో ప్రస్తావించారు. 2015లో కేంద్రప్రభుత్వం రూ.1000 కోట్లు విజయవాడ, గుంటూరు నగరాల్లో స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులకు కేటాయించింది
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంటులో ప్రస్తావించారు. 2015లో కేంద్రప్రభుత్వం రూ.1000 కోట్లు విజయవాడ, గుంటూరు నగరాల్లో స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులకు కేటాయించింది. ఇందులో విజయవాడకు రూ.468 కోట్లు, గుంటూరుకు రూ.532 కోట్లు కేటాయించారు. నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మొత్తం నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినా ఇప్పటి వరకు కేవలం 50 శాతం పనులు మాత్రమే జరిగాయని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి పనులు చేపట్టలేదని నాని లోక్‌సభలో గురువారం ప్రస్తావించారు. ఈ పనులు నగరవాసులకు ఎంతో ముఖ్యమైనవని, వెంటనే దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. ప్రాజెక్టు పనుల పరోగతి, నిధుల వినియోగంపై సమగ్ర సమచారం సేకరించి, పనులు ఎందుకు నిలిచిపోయాయో తెలుసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై నిరంతరం సమీక్షిస్తున్నామని, నిర్దేశిత పనులకు కేంద్రం ఇచ్చిన నిధులను వాటికే వెచ్చించాలని, మంత్రి స్పష్టం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు అమృత్, అమృత్ 2.0 కింద నిధులు ఇచ్చారని, మొత్తం 8 ప్రాజెక్టుల కింద రూ.128.53 కోట్లు ఇచ్చారని, అందులో ఆరు ప్రాజెక్టులకు ఇచ్చిన నిధులతో పార్కులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా రూ.468 కోట్లు ఇచ్చారని, ఈ పనులు ఎందుకు నిలిచిపోయాయో తెలుసుకుంటామన్నారు.
వైసీపీ నేతల లంచాలే పనులకు శాపం
విజయవాడ నగరాన్ని వర్షపు నీరు ముంచెత్తకుండా స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లను అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్‌ఫాల్ డ్రెయిన్‌ను బుడమేరులో కలపాల్సి ఉంది. మేజర్, మైనర్ డ్రెయిన్లను 444 కిలోమీటర్లు నిర్మించడానికి ఎల్‌అండ్‌టీ టెండర్లను దక్కించుకుంది. టీడీపీ హయాంలో స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులు ప్రారంభించింది. 50 శాతం పూర్తయిన తర్వాత పనులను అర్ధంతరంగా నిలిపివేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నేతలు పనుల్లో వాటాల కోసం.. లంచాల కోసం పీడిస్తుండటంతో ఎల్‌అండ్‌టీ చేతులెత్తేసి వెళ్లిపోయింది. దీంతో ఇప్పటికే పూర్తిచేసిన డ్రెయిన్లు సైతం నిరుపయోగంగా మిగిలిపోయాయి. స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు పూర్తికాక తరచూ డ్రెయినేజీలకు చిన్నారులు బలవుతున్నారు. ఎట్టకేలకు సమస్యను ఎంపీ నాని పార్లమెంటులో ప్రస్తావించడంతో ఇకనైనా ఈ పనులకు మోక్షం కలుగుతుందని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.
కేంద్రం రూ.1000 కోట్లు ఇచ్చినా రాష్ట్రం పనులు చేయడం లేదు
విజయవాడ ఎంపీ కేశినేని నాని
న్యూఢిల్లీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లకు కేంద్రప్రభుత్వం రూ.1000 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయడంలేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. గురువారం, లోక్‌సభలో ఆయన మాట్లాడారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు రూ.468 కోట్లు, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్‌కు రూ.532 కోట్లు కేంద్రం 2015లో రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. విజయవాడలో వరదనీటిపారుదల వ్యవస్థ, గుంటూరు భూగర్భ డ్రెయినేజీ కోసం కేంద్రం ఈ నిధులిచ్చిందన్నారు. తొమ్మిదేళ్లలో విజయవాడ వరదనీటిపారుదల వ్యవస్థకు సంబంధించి పనులు 30-40 శాతం పూర్తయ్యాయన్నారు. 2019లో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత పనులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కేందాన్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. పనుల పురోగతిని సమీక్షిస్తామని, పనులు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఏ రాష్ట్రప్రభుత్వమైనా సకాలంలో ఖర్చు పెట్టాలని అన్నారు.