మా కార్పొరేటర్ ఎక్కడ..?
ABN , First Publish Date - 2023-03-05T00:36:38+05:30 IST
తమ డివిజన్ కార్పొరేటర్‌ను చూసి చా లా కాలమైందని, సమస్యలను గాలికి వదిలేశారంటూ 64వ డివిజన్ రా ధానగర్ వాసులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాయకాపురం, మార్చి 4 : తమ డివిజన్ కార్పొరేటర్‌ను చూసి చా లా కాలమైందని, సమస్యలను గాలికి వదిలేశారంటూ 64వ డివిజన్ రా ధానగర్ వాసులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయకాపురం రాధానగర్ ప్రాంతంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం జరిగింది. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే ముందు పెట్టారు. డివిజన్‌లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, కాలువల్లో పూడిక తీసి ఆరునెలలైందని, ఎమ్మెల్యే వస్తున్నాడని ఈరోజు తీశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజుల నుంచి మంచినీరు రావడం లేదని ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని డివిజన్ కార్పొరేటర్ సమస్యలను గాలికి వదిలేశారని ఫిర్యాదు చేశారు. అలాగే మీరు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఎన్నికలప్పుడు వచ్చారని, మళ్లీ ఇప్పుడు చూస్తున్నామంటూ విమర్శించారు. మరో మహిళ తనకు ఏ ప్రభుత్వ పథకం రావడం లేదని, ఐటీ రిటర్న్స్ ఉన్నాయంటూ పథకాలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ పేరుతో ఐటీ రిటర్న్స్ ఏమి లేవని రూ.2వేలు ఖర్చుపెట్టించి 26(ఏ) ఫారం తెప్పించి సచివాలయ సిబ్బందికి అందజేస్తే కొన్ని రోజుల తర్వాత ఫారాలు పోయాయని మళ్లీ తేవాలని వేధిస్తున్నట్టు ఎమ్మెల్యేకు మెరపెట్టుకుంది. మహిళ గోడు విన్న ఎమ్మెల్యే పథకాలు రావాలంటే తిరగాలని బద్ధకంగా వెళ్తే ఎలా అని ఎదురు ప్రశ్నించడంతో మహిళ మరింత ఆగ్రహానికి గురై అసహనం వ్యక్తం చేసింది.