ఏటీసీఎస్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఎప్పుడు..?

ABN , First Publish Date - 2023-01-25T00:53:14+05:30 IST

ఏటీసీఎస్‌... అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టం ఏర్పాటులో అడుగులు ముందుకు పడట్లేదు. ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిధులు విడుదలైనా కంపెనీల నుంచి ఆసక్తి కొరవడటంతో ఈ అత్యాధునిక వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు.

ఏటీసీఎస్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఎప్పుడు..?

నగరంలోని 25 కూడళ్లలో తొలిదశలో ఏర్పాటుకు ప్రతిపాదనలు

కంపెనీలు, అధికారులతో ఇప్పటికే పూర్తయిన సర్వే

రూ.5 కోట్లు కేటాయించిన కార్పొరేషన్‌

మూడు దశల్లో ఏర్పాటుకు నిర్ణయం

వెనకడుగు వేసిన కంపెనీలు

ఊసే మరిచిపోయిన అధికారులు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విజయవాడ నగరంలో ప్రస్తుతం ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ దానికి అప్‌డేట్‌ వెర్షన్‌ను చూపించాలని అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు తలోపక్కా చూస్తున్నాయి. గడిచిన ఏడాది ఆగస్టులో వేగంగా కదిలిన ఏటీసీఎస్‌ ఫైళ్లపై ఇప్పుడు పర్యవేక్షణ కొరవడింది. ఇప్పుడున్న సిగ్నలింగ్‌ వ్యవస్థతో అటు పోలీసులు వాహనాలను నియంత్రిస్తున్నారు. అన్ని కూడళ్లలో సిగ్నల్‌ వెలుగులు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ప్రధాన రహదారుల జాబితాలో ఉన్న కూడళ్లలో మాత్రమే సిగ్నలింగ్‌ వ్యవస్థ నడుస్తోంది. ప్రధాన కూడళ్లతో పాటు నగరం మొత్తం ఏటీసీఎస్‌ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. దీనికి సంబంధించి ఆగస్టులో ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ పేరుతో తొమ్మిది కంపెనీలకు లేఖలు రాశారు. ఇందులో ఆరు కంపెనీలు పోలీసు, వీఎంసీ అధికారులు నిర్వహించిన సంయుక్త సమావేశానికి హాజరయ్యాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు, అధికారులు కలిసి నగరవ్యాప్తంగా పర్యటించి ఒక సర్వే నిర్వహించారు. ఆ తర్వాత నుంచి జరగాల్సిన ప్రక్రియ ముందుకు సాగలేదు. నిధుల కొరత, కంపెనీల నుంచి స్పందన రాకపోవడం దీనికి కారణమని తెలుస్తోంది.

మూడు దశల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు

10 లక్షల జనాభా దాటిన నగరాల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం మిలియన్‌ ప్లస్‌ నగరాలకు కొద్దినెలల క్రితం నిధులను విడుదల చేసింది. ఈ నిధుల నుంచి రూ.5 కోట్లతో ట్రాఫిక్‌ వ్యవస్థను అప్‌డేట్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. నగరంలోని మొత్తం 25 కూడళ్లలో ఏటీసీఎస్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఎక్కడెక్కడంటే..

బెంజిసర్కిల్‌, నిర్మలా జంక్షన్‌, రమేష్‌ ఆసుపత్రి జంక్షన్‌, మహానాడు జంక్షన్‌, రామవరప్పాడు జంక్షన్‌, పీసీఆర్‌ జంక్షన్‌, పీసీఆర్‌ వై జంక్షన్‌, డీసీపీ బంగ్లా, రాఘవయ్య పార్కు, రామలింగేశ్వరనగర్‌ కట్ట, ఆంజనేయస్వామి ఆలయం, ఎనికేపాడు 100 అడుగుల రోడ్డు, గొల్లపూడి వన్‌ సెంటర్‌, గొల్లపూడి వై జంక్షన్‌, సితార జంక్షన్‌, చిట్టినగర్‌, పుష్ప హోటల్‌, స్వర్ణప్యాలెస్‌, దీప్తి సెంటర్‌, విద్యాధరపురం జంక్షన్‌, పైపులరోడ్డు జంక్షన్‌, సిద్ధార్థ ఆడిటోరియం జంక్షన్లకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం మూడు దశల్లో ఏటీసీఎస్‌ పనులను పూర్తి చేయాలన్నది అధికారుల నిర్ణయం.

కంపెనీలు వెనకడుగు

మొదటి దశలో 25 కూడళ్లకు కొత్త వెలుగులు ఇవ్వలేమని నాడు సర్వేలో పాల్గొన్న కంపెనీలు తేల్చిచెప్పాయి. రూ.5కోట్లకు ఈ పనులన్నీ పూర్తికావని కంపెనీల ప్రతినిధులు తేల్చారు. వీఎంసీ కేటాయించిన రూ.5 కోట్లు 10-12 కూడళ్లకు మాత్రమే సరిపోతాయి. నాడు నగరంలో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో కొన్ని మాత్రమే ఏటీసీఎస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఆయా కంపెనీలకు అధికారులు లెటర్‌ ఆఫ్‌ కన్ఫర్మేషన్‌ రాస్తున్నారు. వారి నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన లేదు. నగరంలో కచ్చితంగా ఏటీసీఎస్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆయా కంపెనీలకు త్వరలో మరో లేఖ రాస్తున్నామని వివరించారు.

Updated Date - 2023-01-25T00:53:15+05:30 IST