ప్రజల సొమ్ము కాజేసిన బిల్‌కలెక్టర్‌పై చర్యలేవి?

ABN , First Publish Date - 2023-03-26T00:45:44+05:30 IST

ప్రజల వద్ద పన్నులు వసూలుచేసి మునిసిపల్‌ ఖజానాకు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడ్డ బిల్‌ కలెక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని కౌన్సిల్‌ సమావేశంలో పాలకపక్ష సభ్యులు నిలదీశారు.

ప్రజల సొమ్ము కాజేసిన బిల్‌కలెక్టర్‌పై చర్యలేవి?
శానిటేషన్‌పై ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు సుందరమ్మ, అనూరాధ

జగ్గయ్యపేట, మార్చి 25: ప్రజల వద్ద పన్నులు వసూలుచేసి మునిసిపల్‌ ఖజానాకు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడ్డ బిల్‌ కలెక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని కౌన్సిల్‌ సమావేశంలో పాలకపక్ష సభ్యులు నిలదీశారు. మునిసిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన అత్యవసర సమా వేశంలో వైస్‌చైర్మన్‌ తుమ్మల ప్రభాకర్‌, కౌన్సిలరు వట్టెం మనోహర్‌ మాట్లాడుతు అసెస్‌మెంట్‌దార్ల నుంచి రూ.లక్షలు వసూలు చేసి ఖజానాకు చెల్లించ కుండా అవకత వకలకు పాల్పడిన బిల్‌కలెక్టర్‌ సునీల్‌ కుమార్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోకపోవటంపై అభ్యంతరం తెలిపారు. రెవెన్యూ అధికారి రత్నావళి మాట్లాడుతూ సునీల్‌ అవకతవకలను తామే గుర్తించా మని, తర్వాత 15మంది అసెస్‌మెంట్‌దారులు రూ.5లక్షలు చెల్లించినట్టు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. ఫేక్‌ బిల్లులు ఇచ్చి యజమానులను మోసం చేశారని గుర్తించి నివేదిక ఇచ్చామని, సస్పెండ్‌ కూడా చేశారన్నారు. చైర్మన్‌ జోక్యం చేసుకుని ఆర్‌వో తన నివేదికను ఆర్డీకి పంపారని, ఉద్యోగి నుంచి ఆ మొత్తం వసూలు చేసి బాధితులు ఇప్పించేందుకు కమిషనర్‌ చొరవ తీసుకున్నారన్నారు. రూ.2.10లక్షలు ఇప్పటికి వసూలు చేశామన్నారు. మిగిలిన మొత్తానికి రెండు వారాలు గడువు ఇచ్చినట్టు కమిషనర్‌ శివకోటేశ్వరరావు తెలిపారు. హోటల్‌ కాంప్లెక్స్‌కు సంబంధించి ఆస్తిపన్ను సెటిల్‌మెంట్‌ తీర్మానం కోసం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయటంపై వైసీపీ కౌన్సిలర్లు తుమ్మల, వట్టెంలు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ ఇవ్వటం వల్ల మునిసి పాలిటీకి కోటి రూపాయాల ఆదాయం పోతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని, పురపాలక సంఘానికి మొండి బకాయిలు వసూలు అవుతాయన్నారు.

శానిటేషన్‌పై ధ్వజం

పట్టణంలో శానిటేషన్‌పై పాలకపక్ష కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్‌చైర్మన్‌ హఫీజున్నీసా, పాకాలపాటి సుందరమ్మ, కాశీ అనురాధ, గింజుపల్లి వెంకట్రావు ఇంటింటి చెత్త సేకరణ జరగటంలేదని, కాల్వలో తీసిన పూడిక నెలలు తరబడి తొలగించటం లేదన్నారు. ఆర్డీ ఆదేశించినా ఎర్రకాల్వలో పూడికను ట్రాక్టర్లపై పట్టాలు లేకుండానే తరలిం చటంపై అస హనం వ్యక్తం చేశారు. చైర్మన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు మెమో ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు.

పైసా ఆదాయం లేదు...

వార్డులో చిన్న పనికూడా కావటం లేదు. కౌన్సిలర్‌గా ఏడాది దాటినా పైసా ఆదాయం రావటం లేదని కౌన్సిలర్‌ నూకల సాంబ అన్నారు. పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలని చైర్మన్‌ను కోరారు.

Updated Date - 2023-03-26T00:45:44+05:30 IST