సీఎంకు జనసేన నిరసన సెగ చూపిస్తాం

ABN , First Publish Date - 2023-09-26T01:16:27+05:30 IST

ఈనెల 29న నగరంలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా జనసేన నిరసన ఎలా ఉంటుందో చూపిస్తామని జనసేన అధికార ప్రతినిధి, పశ్చిమ ఇన్‌చార్జి పోతిన మహేష్‌ అన్నారు.

సీఎంకు జనసేన నిరసన సెగ చూపిస్తాం

వన్‌టౌన్‌, సెప్టెంబరు 25: ఈనెల 29న నగరంలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా జనసేన నిరసన ఎలా ఉంటుందో చూపిస్తామని జనసేన అధికార ప్రతినిధి, పశ్చిమ ఇన్‌చార్జి పోతిన మహేష్‌ అన్నారు. వన్‌టౌన్‌లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. పశ్చిమలో సీఎం జగన్‌ ఏం అభివృద్ధి చేశారని పదే పదే వస్తున్నారని ప్రశ్నించారు. పశ్చిమలో 2024 ఎన్నికల్లో వైసీపీకి, వెలంపల్లి శ్రీనివాసరావుకు ఓటమి తప్పదని, జనసేన అభ్యర్థిగా తన గెలుపు ఖాయమన్నారు. కబ్జాకు గురైన గాలి షాహిద్‌ దర్గా భూములను కాసాడగలిగారా, పాతరాజరాజేశ్వరిపేట వాసులకు ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్‌ చే యించారా, పేదలకు టిడ్కో నివాసాలు కేటాయించా రా, జగనన్న కాలనీలో ఒక్క నివాసమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు వడ్డీ మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం నిధులు మంజూరు చేయాలన్నారు. మంత్రి కొ ట్టు సత్యనారాయణ తన పదవి నిలబెట్టుకునేందుకు స్టేడియంలో నిర్వహించిన రాజశ్యామల యాగానికైన ఖర్చులను దుర్గగుడి నుంచి రూ.45,02,000 నిధులు విడుదల చేయాలని సర్క్యులర్‌ జారీ చేయడంపై మహేష్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విటర్‌ ఎక్స్‌లో విమర్శలను షేర్‌ చేశారు. ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలన్నారు. ఈమొత్తాన్ని ఈవో ఎలా చెల్లిస్తారో భక్తులకు సంజాయిషీ ఇవ్వాలన్నారు.

చరిత్ర సృష్టించబోతున్న వారాహి: రామకృష్ణ

పటమట: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కృష్ణాజిల్లాలో చేపట్టనున్న వారాహి యాత్ర చరిత్ర సృష్టించబోతుందని జనసేన కృష్ణాజిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ తెలిపారు. సోమవారం నగరంలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4వ విడత వారాహి యాత్ర అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభం కానుందని, టీడీపీతో పొత్తు ప్రకటించాక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర తొలిసారి జరగనుందని, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారని, టీడీపీ, జనసేన కార్యకర్తలు యాత్రను జయప్రదం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారాహి యాత్రకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ కృష్ణాజిల్లా వైసీపీ నేతల అవినీతిపై తనమార్క్‌ బాణాలను, మాటల తూటలను స్పందిస్తారని, వెసీపీ నేతల అక్రమ దందాలపై ప్రజా క్షేత్రంలో ఎండగడతారన్నారు. ఈ యాత్ర అక్టోబర్‌ 1న అవనిగడ్డలో, 2న మచిలీపట్నం, 3న పెడనలో జరుగుతుందని, 5న కైకలూరులో నిర్వహించబోతున్నామన్నారు. జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మదీదు శివరామకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి చిమటా రవివర్మ, అడ్డగిరి రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:16:27+05:30 IST