నేడు కాల్వలకు నీటి విడుదల

ABN , First Publish Date - 2023-06-07T00:50:38+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణాడెల్టాకు సాగు నీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు.

నేడు కాల్వలకు నీటి విడుదల

విజయవాడ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణాడెల్టాకు సాగు నీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు బుధవారం నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. నగరంలోని రైతు శిక్షణా కేంద్రంలో నీటిపారుదల సలహా మండలి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి జోగి రమేశ్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు, కృష్ణాజిల్లా కలెక్టర్‌ రాజాబాబు, రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీవీ నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్‌, సింహాద్రి రమేశ్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, జలవనరుల శాఖ ఎస్‌ఈ తిరుమలరావు పాల్గొన్నారు. అధికారులతో చర్చించిన తర్వాత బుధవారం నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. గడిచిన ఏడాది జూన్‌ 10న ఖరీఫ్‌కు సాగునీటిని విడుదల చేశారు. ఈసారి మూడు రోజులు ముందే విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ముందుగా రైవస్‌ కాల్వకు గానీ, ఏలూరు కాల్వకు గానీ నీటిని విడుదల చేస్తారు. అదే రోజున పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. తొలుత 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.

త్వరలో బ్యారేజీల నిర్మాణం : జోగి రమేష్‌

సముద్రంలోకి వృఽథాగా పోతున్న నీటిని భద్రం చేసుకోవడానికి కృష్ణానదిపై రెండు బ్యారేజీలు నిర్మిస్తున్నాం. ఎగువ ప్రాంతంలో దాములూరు వద్ద ఒక బ్యారేజీ నిర్మిస్తాం. దీనికి అంచనాలను రూపొందించారు. పరిపాలనా అనుమతులు రావాల్సి ఉంది.

ఇబ్బందులు ఉంటే చెప్పండి : దిల్లీరావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌

జిల్లాలో సాగునీటి పంపిణీలో లోపాలు, ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేస్తాం.

Updated Date - 2023-06-07T00:50:46+05:30 IST