వహీదా మూలాలు బెజవాడలోనే..

ABN , First Publish Date - 2023-09-27T00:55:30+05:30 IST

వహీదా రెహ్మాన్‌ ఈ పేరు వింటే విజయవాడ పులకరిస్తుంది. బెజవాడ గడ్డపై పెరిగిన ఆమె తెలుగు, హిందీ చిత్రపరిశ్రమలో అందాల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించిన తర్వాత విజయవాడలో ఉన్న ఆమె బంధువర్గం సంబరాలు చేసుకుంటోంది.

వహీదా మూలాలు బెజవాడలోనే..

ఇక్కడి నుంచి సినీరంగ ప్రవేశం

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో ఆమె బంధువుల సంబరాలు

విజయవాడ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : వహీదా రెహ్మాన్‌ ఈ పేరు వింటే విజయవాడ పులకరిస్తుంది. బెజవాడ గడ్డపై పెరిగిన ఆమె తెలుగు, హిందీ చిత్రపరిశ్రమలో అందాల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించిన తర్వాత విజయవాడలో ఉన్న ఆమె బంధువర్గం సంబరాలు చేసుకుంటోంది. వహీదా రెహ్మాన్‌ చెన్నైలోని చెంగల్‌పట్టులో జన్మించారు. ఆమె తండ్రి అబ్దుల్‌ రెహ్మాన్‌ ఐఏఎస్‌ అధికారి కావడంతో కుటుంబం వివిధ ప్రాంతాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే కొన్నాళ్లు విజయవాడలో స్థిరపడ్డారు. అబ్దుల్‌ రెహ్మాన్‌ విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. వహీదా రెహ్మాన్‌ బ్యాలమంతా బెజవాడలో సాగింది. ఇక్కడ నాట్యం నేర్చుకున్నారు. ఈ నాట్యం ద్వారానే ఆమెకు తెలుగు చిత్రపరిశ్రమలో అవకాశాలు వచ్చాయి. ఎక్కువకాలంలో తెలుగు చిత్రపరిశ్రమలో ఉండలేదు. అక్కడి నుంచి అతితక్కువ కాలంలోనే హిందీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్‌తో కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న వహీదాకు విజయవాడ లబ్బీపేట, బెంజ్‌సర్కిల్‌ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. లబ్బీపేటలో ఉన్న స్థలాన్ని ఖైరుల్లా అనే ఆయన మరికొంతమందితో కలిసి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అక్కడ పేద ముస్లిం విద్యార్థుల కోసం దరజ్గా ఎ ఇస్తామి హైస్కూల్‌ను నడుపుతున్నారు. దీన్ని ఒక సొసైటీ నిర్వహిస్తోంది. బెంజ్‌సర్కిల్‌, లబ్బీపేటలో వహీదాకు బంధువర్గం ఉంది. నాలుగు నెలల క్రితమే ఆమె విజయవాడకు వచ్చివెళ్లారు. విజయవాడ మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన ఖుద్దూస్‌ ఆమెకు దూరపు బంధువు. ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షారుక్‌ షుబ్లీకి వహీదా సమీప బంధువు. విజయవాడ నుంచి ఎదిగిన వహీదాకు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-27T00:55:30+05:30 IST