Share News

భూహక్కు చట్టంతో ఆస్తి హక్కుకు భంగం

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:21 AM

భూ హక్కు చట్టం-2022తో ఆస్తి హక్కుకు భంగం వాటిల్లుతుందని, మేధావులు, ప్రజలు ముక్తకంఠంతో ఈ చట్టాన్ని ఖండించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు.

భూహక్కు చట్టంతో ఆస్తి హక్కుకు భంగం
భూ హక్కు చట్టం-2022కు వ్యతిరేకంగా న్యాయవాదులు నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న వక్తలు

‘సుప్రీం’ తీర్పులకు తూట్లు పొడుస్తూ తెచ్చిన చట్టమిది

మేధావులు, ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు

విజయవాడ లీగల్‌, డిసెంబరు 29: భూ హక్కు చట్టం-2022తో ఆస్తి హక్కుకు భంగం వాటిల్లుతుందని, మేధావులు, ప్రజలు ముక్తకంఠంతో ఈ చట్టాన్ని ఖండించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. భూ హక్కు చట్టం-2022కు వ్యతిరేకంగా బెజవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల ఆధ్వర్యంలో బార్‌ హాలులో శుక్రవారం రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వ హించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతుసంఘాల ప్రతిని ధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల యాజమాన్య చట్టం-2022ను తెస్తూ జీవో 512ను జారీ చేసింది. న్యాయ నిబంధనలకు విరుద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకుంటూ భూమి హక్కులను నిర్ధారించే అధికారాన్ని న్యాయపరిజ్ఞానం లేని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ భూ హక్కుల ప్రాధికార సంస్థ(ల్యాండ్‌ టైటిలింగ్‌ అథారిటీ)ను ఏర్పాటు చేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం. భూ యజమాని హక్కుల పరిరక్షణకు ఆస్తి బదలా యింపు చట్టం, రిజిస్ర్టేషన్‌ చట్టం, భారతీయ స్టాంప్‌ చట్టం, కాలపరిమితి చట్టం(లిమిటేషన్‌యాక్ట్‌), ఈజ్‌మెంట్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ భూ కేటాయింపు చట్టం, ఇనాం రద్దు చట్టం, పట్టాదారు పాస్‌బుక్‌ చట్టం, సర్వే, హద్దుల చట్టం ఉన్నాయి. భూ వివాదాలు ఏర్పడినప్పుడు సివిల్‌ కోర్టుల ద్వారా పరి ష్కరించుకుంటున్నారు. వీటికి అప్పీల్స్‌ కూడా కోర్టు పరిధిలోనే ఉంటు న్నాయి. మ్యూటేషన్‌ మాత్రమే రెవెన్యూ అధికారుల చేతిలో ఉంటుంది. రిజి స్ర్టేషన్‌కు ప్రత్యేక విభాగం ఉంది. రెవెన్యూ లేదా మున్సిపల్‌ అధికారుల ఆధ్వర్యంలో సర్వే జరుగుతుంది. వీటన్నింటిని తోసిపుచ్చి కొత్త చట్టంలో సంపూర్తి అధికారాలను రెవెన్యూ అధికారులకు సంక్రమింపజేశారు. సుప్రీం కోర్టు తీర్పులకు భారత రాజ్యాంగం, వివిధ కేంద్ర చట్టాల్లో ఉన్న నిబంధ నలకు వ్యతిరేకంగా ఈచట్టాన్ని తెచ్చారు.’’ అని వక్తలు పేర్కొన్నారు. ప్రభు త్వం ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు న్యాయవాదులు చేసే పోరాటానికి తమ మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో బార్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కేబీ సుందర్‌, పుప్పాల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి జన్ను శ్రీధర్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సూరాబత్తుల మల్లేశ్వరరావు, చలసాని అజయ్‌కుమార్‌, మాజీ బార్‌ అధ్యక్షుడు చేకూరి శ్రీపతి, మట్టా జయకర్‌, సోము కృష్ణమూర్తి, ఏపీ రైతు సంఘం నాయకులు కేవీవీ ప్రసాద్‌, తెలుగు రైతు ఏపీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరెడ్డి, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ, సీపీఎం నేత కృష్ణయ్య, టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, జనసేన నేత మహేష్‌, సీపీఎం నేతలు సీహెచ్‌ బాబూరావు, యలమం దయ్య, న్యాయవాదులు బొమ్మసాని రవి, గూడపాటి లక్ష్మీనారా యణ, ఎ.ఎస్‌.ఎస్‌.రాంప్రసాద్‌, కోట జయరాజు, యు.సునీల, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, నామాల కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 01:21 AM