వేమన శతకం.. సామాజిక వికాసం

ABN , First Publish Date - 2023-01-20T00:16:00+05:30 IST

తేటతెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమన అని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అన్నారు.

వేమన శతకం.. సామాజిక వికాసం
కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు నివాళులు

గవర్నర్‌పేట, జనవరి 19 : తేటతెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమన అని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అన్నారు. వేమన జయంతిని పురస్కరించుకుని గురువారం మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి విజయబాబు ముఖ్యఅతిధిగా హాజరై జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావుతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ, సమాజంలోని సమస్యలను విభిన్న కోణాలలో దర్శించి వాటి వైశిష్ట్యాన్ని పద్యాల రూపంలో అందించారన్నారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరుతో జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం వంటి అనేక సామాజిక లోటుపాట్లను వేమన తన కలం ద్వారా వివరించారని, పద్యాల ద్వారా నీతిని చాటిచెప్పారని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను రాయించి కేంద్ర సాహిత్య అకాడమి 14 భాషలలో అనువదింప చేయడం జరిగిందన్నారు. వేమన పద్యాలను నేటి తరంలోని ప్రతి ఒక్కరూ చదివి వాటిలోని సారాంశాన్ని తెలుసుకుని సామాజిక విలువలను కాపాడటంలో భాగస్వాములు కావాలని కోరారు. కలెక్టర్‌ దిల్లీరావు మాట్లాడుతూ 17వ శతాబ్ధం నాటి వేమన రచనలను, పద్యాలను 20వ శతాబ్ధంలోనూ స్మరించుకుంటున్నామంటే వాటికి ఉన్న విలువలు నేటి తరం గుర్తుంచుకోవాలన్నారు. వేమన శతకంపై నిర్వహించిన పోటీ ల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.6 వేలు, తృతీయ బహుమతిగా రూ. 4 వేలు కలెక్టర్‌ వ్యక్తిగ తంగా అందించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వేమన శతకం పుస్తకాలు, ప్రశంసా పత్రం అందజేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.భాగ్యలక్ష్మీ, అధికార భాషా సంఘం సభ్యులు జి.రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో..

ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి కార్యక్రమం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించారు. వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌. దిల్లీరావు పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్రతి రోజూ ఒక వేమన పద్యాన్ని నేర్చుకుని వాటిలోని నీతిని తెలుసుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు.

యునైటెడ్‌ ఎన్జీవో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..

ధర్నాచౌక్‌ : యోగి వేమన గొప్ప సామాజిక విప్లవకారుడని ఆయన పద్యాలు సమాజాన్ని చైతన్య పరచేందుకు దోహదపడతాయని యునైటెడ్‌ ఎన్జీవో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు రాంబాబు తెలిపారు. వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - 2023-01-20T00:16:03+05:30 IST