ఆశలు మునక

ABN , First Publish Date - 2023-05-02T00:33:08+05:30 IST

అకాల వర్షం రైతులను నిలువునా ముంచేసింది. మూడు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా కురిసన వాన మొక్కజొన్న, పసుపు పంటలను నీటిపాలు చేసింది. కోసి ఆరబోసిన మొక్కజొన్న నీళ్లలో తేలాడుతోంది. పసుపు కొమ్ములు తడిచిపోయాయి. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. గుడివాడలో అత్యధికంగా 80.2 మిల్లీ మీటర్లు, పమిడిముక్కలలో అత్యల్పంగా 7.6 మిల్లీమీటర్లు, జల్లా సగటు వర్షపాతం 43.6 మిల్లీ మీటర్లుగా నమోదైంది. మరో రెండు రోజులపాటు కోస్తాతీరం వెంబడి భారీ వర్షాలు, 4, 5 తేదీల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సోమవారం హెచ్చరికలు జారీచేసింది.

ఆశలు మునక

పసుపు, మొక్కజొన్న, వరి పంటలకు తీరని న ష్టం

రైతులను నిలువునా ముంచిన వాన

23,380 క్వింటాళ్ల పసుపు నీటిలోనే

వందల ఎకరాల్లో నీట మునిగిన మొక్కజొన్న

కల్లాల్లో ఆరబోసిన పంటకు నష్టం

మరో రెండ్రోజులు వర్ష సూచన

అకాల వర్షం రైతులను నిలువునా ముంచేసింది. మూడు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా కురిసన వాన మొక్కజొన్న, పసుపు పంటలను నీటిపాలు చేసింది. కోసి ఆరబోసిన మొక్కజొన్న నీళ్లలో తేలాడుతోంది. పసుపు కొమ్ములు తడిచిపోయాయి. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. గుడివాడలో అత్యధికంగా 80.2 మిల్లీ మీటర్లు, పమిడిముక్కలలో అత్యల్పంగా 7.6 మిల్లీమీటర్లు, జల్లా సగటు వర్షపాతం 43.6 మిల్లీ మీటర్లుగా నమోదైంది. మరో రెండు రోజులపాటు కోస్తాతీరం వెంబడి భారీ వర్షాలు, 4, 5 తేదీల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సోమవారం హెచ్చరికలు జారీచేసింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో పసుపు 4253 ఎకరాల్లో సాగైంది. ఎకరానికి పసుపు సాగు నిమిత్తం రూ.1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడిగా పెట్టారు. జిల్లావ్యాప్తంగా పసుపు 1,18,182 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. పసుపుతీత దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. తీసిన పసుపును ఎండబెట్టేందుకు పొలంలోనూ, కల్లాల్లోనూ ఉంచారు. మూడు రోజులుగా ఊహించని విధంగా జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురవడంతో పొలంలో, కల్లాల్లో ఉన్న పసుపు నీటిలో మునిగిసోయింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పసుపు కొనుగోలు చేయకపోవడంతో రైతులు వర్షానికి అడ్డంగా దొరికిపోయారు. ప్రాథమిక అంచనా ప్రకారం 23,380 క్వింటాళ్ల పసుపు పొలంలో, కల్లాల్లో ఉండి నీట మునిగినట్టు ఉద్యానశాఖ అదికారులు గుర్తించారు. తోట్లవల్లూరు మండలంలో 10,888 క్వింటాళ్లు, పెనుమలూరు, మండలంలో 3140 క్వింటాళ్లు, కంకిపాడు మండలంలో 2630 క్వింటాళ్లు, మోపిదేవిలో 1955, అవనిగడ్డలో 1696, చల్లపల్లిలో 1509, ఉయ్యూరులో 967, పమిడిముక్కలలో 971, మొవ్వలో 885, ఘంటసాల, నాగాయలంక, పామర్రు, పమిడిముక్కల తదితర మండలాల్లో మొత్తంగా 23,380 క్వింటాళ్ల పసుపు భారీ వర్షాల కారణంగా నీటమునిగినట్లుగా ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. పసుపు క్వింటాలు మద్దతు ధర రూ.850గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సీజన్‌లో ప్రభుత్వం ద్వారా పసుపు కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు క్వింటాలు పసుపు నాణ్యతను బట్టి రూ.3,600 నుంచి రూ.4,600కు మాత్రమే ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో రైతులు ఇప్పటివరకు 4731 క్వింటాళ్లను మాత్రమే విక్రయించారు. ఇంకా రైతుల వద్ద ఉన్న 1,13,831 క్వింటాళ్లు పసుపు విక్రయానికి నోచుకోలేదు. ఈలోగా పసుపుసాగు చేసిన మండలాల్లో మూడు రోజులుగా భారీవర్షం కురవడంతో రైతులు నిలువునా మునిగిపోయారు.

నీటిలో మొక్కజొన్న కండెలు

చల్లపల్లి : మండువేసవిలో భారీ వర్షాలు రైతులకు నష్టాలు కలిగిస్తున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని మొక్కజొన్న పొలల్లోకి నీరు చేరింది. కోతకు సిద్ధమైన మొక్కజొన్న కంకులు తడిచిపోయాయి.1100 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, వెలివోలు, పాగోలు, పురిటిగడ్డ, నడకుదురు, రాముడుపాలెం పరిధిలో సుమారు 250 ఎకరాలకుపైగా చేలల్లో మొక్కజొన్న కోత దశకొచ్చి కొంత, కోసి కల్లాల్లోనే మరికొంత ఉంది. తడిచిన మొక్కజొన్నకు బూజుపట్టి దెబ్బతింటుందనీ, వర్షాలు నష్టం కలిగించాయని రైతులు వాపోతున్నారు.

కూరగాయల తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

మామిడిలో మొదటిపూతలో పూర్తిస్థాయిలో నిలబడిందని, రెండు, మూడు పూతలకు సంబంధించి కాయలు వాతవరణంలో మార్పుల కారణంగా రాలిపోయాయని, మంగు తెగులు కూడా వచ్చిందని జిల్లా ఉద్యానశాఖ ఏడీ జ్యోతి తెలిపారు. జిల్లాలో కూరగాయల తోటలు 5వేల ఎకరాల్లో సాగయ్యాయని భారీవర్షాల కారణంగా కూరగాయల తోటల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే ఏర్పాట్లు రైతులు చేయాలన్నారు. నేల కొంతమేర పొడిబారే వరకుమొక్కలకు ఉన్న వేర్లు ఆహారం తీసుకోవని ఆమె తెలిపారు. ఈలోగా మొక్కలకు ఆహారం అందించేందుకు 19ః19ః19 ఎరువు ద్రావణాన్ని వ్యవసాయశాఖ అధికారుల సూచన మేరకు పైపాటుగా కూరగాయల మొక్కలపై పిచికారీ చేయాలని ఆమె సూచించారు.

వరి, మొక్కజొన్నలకు తీరని నష్టం

రబీ సీజన్‌లో 15,612 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ప్రస్తుతం ఈ పంట కోత పూర్తయ్యేఽ దశలో ఉంది. వర్షాల కారణంగా 625 ఎకరాల్లోని మొక్కజొన్న నేలవాలి తడిచిపోయింది. కల్లాల్లో ఆరబెట్టిన 1875 క్వింటాళ్ల మొక్కజొన్న భారీ వర్షాల కారణంగా వర్షపునీటిలో తడిచింది. కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, ఉంగుటూరు తదితర మండలాల్లో 750 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరిపైరు నేలవాలి నీటిలో తేలియాడుతోంది. కంకిపాడు మండలం వణుకూరులో కోతకోసి పనలపై ఉన్న వరిపైరు తడిచిపోయింది. మూడు వందల బస్తాలకుపైగా ధాన్యం తడిచిపోయిందని వణుకూరుకు చెందిన రైతులు వాపోతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న 300 ఎకరాల్లోని తెల్లజొన్న నేలవాలి నీటిలో తేలియాడుతోంది. తడిచిన మొక్కజొన్నను ఆరబెట్టేందుకు జిల్లాలో డ్రయ్యర్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇక్కట్లపాలవుతున్నారు. హనుమాన్‌జంక్షన్‌, అవనిగడ్డ, మోపిదేవి తదతర ప్రాంతాల్లో మామిడి వర్షాల కారణంగా కొంతమేర నేలరాలింది.

వర్షపాతం వివరాలిలా..

జిల్లాలోని పలుప్రాంతాల్లో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పెదపారుపూడిలో 72.4 మిల్లీ మీటర్లు, బాపులపాడులో 64.2, చల్లపల్లిలో 61.8, నందివాడలో 59.2, మోపిదేవిలో 56.2, నాగాయలంక లో 55.6, ఉంగుటూరులో 48.6, కంకిపాడులో 43.4, అవనిగడ్డలో 42.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంటుమిల్లిలో 42.4 మిల్లీమీటర్లు, గూడూరులో 42.4, తోట్లవల్లూరులో 42.4, మచిలీపట్నంలో 42.2, పెనుమలూరులో 40.2, పెడనలో 39.2, పామర్రులో 38.6, ఉయ్యూరులో 38.6, గుడ్లవల్లేరులో 36.8, కృత్తివెన్నులో 36.4, మొవ్వలో 27.4, గన్నవరంలో 26.8, ఘంటసాలలో 26.4, కోడూరులో 18.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2023-05-02T00:33:08+05:30 IST