కృష్ణాలోకి వారాహి
ABN , First Publish Date - 2023-09-26T02:00:25+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించబోతున్నది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఈ యాత్రను నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. ఐదో తేదీ వరకు ఈ యాత్ర జరగనుంది. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఇప్పటికి మూడు విడతలుగా వారాహి యాత్రను నిర్వహించారు.

విజయవాడ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించబోతున్నది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఈ యాత్రను నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. ఐదో తేదీ వరకు ఈ యాత్ర జరగనుంది. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఇప్పటికి మూడు విడతలుగా వారాహి యాత్రను నిర్వహించారు. నాలుగో విడత ఈ యాత్రకు కృష్ణా జిల్లాను ఎంచుకున్నారు. మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో యాత్ర సాగేలా పార్టీ నేతలు రూటుమ్యాప్ ఖరారు చేశారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఈ వారాహి యాత్ర సాగబోతున్నది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ యాత్రకు సంబంధించి ఆయా నియోజకవర్గాల నేతలో టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇంతకుముందు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను మచిలీపట్నంలో నిర్వహించారు. ఈ సభకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత పవన్ ఎలాంటి పర్యటనలు చేయలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో మూడో విడత వారాహి యాత్రను నిర్వహించినప్పుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలు, వితంతులు, యువతులకు సంబంధించిన సమాచారాన్ని వలంటీర్ల ద్వారా సేకరించి సైబరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఓ ప్రైవేటు డేటాసెంటర్‌లో భద్రపరుస్తారని ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ వలంటీర్ పవన్‌పై విజయవాడ కోర్టులో పరువునష్టం దావా వేసింది. కృష్ణా జిల్లాలో సాగే నాలుగులో నియోజకవర్గాల్లో కైకలూరు జిల్లా విభజనలో ఏలూరు జిల్లా పరిధిలోకి వెళ్లింది. వారాహి యాత్ర సాగే నాలుగు నియోజకవర్గాలో రెండు నియోజకవర్గాల్లో పర్యటన కీలకంగా ఉండనుంది. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ పదేపదే పవన్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వాటికి ఈ నియోజకవర్గాల్లో ఘాటు పవన్‌కల్యాణ్ సమాధానం ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారిగా వారాహి యాత్ర జిల్లాలో అడుగుపెడుతున్నందున దాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.