ప్రాణంతీసిన ఇసుక గుంత

ABN , First Publish Date - 2023-04-14T01:04:52+05:30 IST

ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన నీటి గుంత ఇద్దరు చిన్నారుల ఉసురుతీసింది. కంచికచర్ల మండలం గని ఆత్కూరు గ్రామం వద్ద గురువారం జరిగిన ఈ ఘటనలో పరిటాల ముస్లిం కాలనీకి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు షేక్‌ షాహీద్‌, షేక్‌ షాకీర్‌ మృతిచెందారు. మరో విద్యార్థి షేక్‌ ఇమ్రాన్‌ సురక్షితంగా బయటపడ్డాడు.

ప్రాణంతీసిన ఇసుక గుంత

లోతు తెలియక సరదాగా ఈత కోసం దిగి మృత్యువాత

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు

ఫలితంగా ఏర్పడిన భారీ గుంతలు

కంచికచర్ల, ఏప్రిల్‌ 13 : ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన నీటి గుంత ఇద్దరు చిన్నారుల ఉసురుతీసింది. కంచికచర్ల మండలం గని ఆత్కూరు గ్రామం వద్ద గురువారం జరిగిన ఈ ఘటనలో పరిటాల ముస్లిం కాలనీకి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు షేక్‌ షాహీద్‌, షేక్‌ షాకీర్‌ మృతిచెందారు. మరో విద్యార్థి షేక్‌ ఇమ్రాన్‌ సురక్షితంగా బయటపడ్డాడు. సరదాగా ఈత కోసమని పరిటాల గ్రామానికి చెందిన 14, 15 ఏళ్లు కలిగిన షేక్‌ షాహిద్‌, షేక్‌ షాకీర్‌, షేక్‌ ఇమ్రాన్‌ గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గని ఆత్కూరు వెళ్లారు. గ్రామానికి సుమారు కిలోమీటర్‌ దూరంలోని లంకకు వెళ్లే మార్గంలో గుంత వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు తొలుత షాహిద్‌, షాకీర్‌ గుంతలో దిగారు. ఇమ్రాన్‌ ఒడ్డున ఉండిపోయాడు. గుంతలో దిగిన ఇద్దరూ క్షణాల్లో నీటిలో మునిగిపోయారు. వెంటనే ఇమ్రాన్‌ బిగ్గరగా కేకలు వేయటంతో సమీపంలో ఉన్న స్థానికులు వచ్చి నీటిలో మునిగిపోయిన షాహీద్‌, షాకీర్‌ను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందగానే కంచికచర్ల రూరల్‌ సీఐ నాగేంద్రకుమార్‌, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఇద్దరినీ పోలీస్‌ జీపులో కంచికచర్లలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పల్స్‌ అందకపోవటంతో వెంటనే 108 అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందకముందే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. షాహీద్‌, షాకీర్‌ తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను మార్చురీకి తరలించారు. నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు తంగిరాల సౌమ్య బాధితులను పరామర్శించారు.

ఇసుక గుంత కారణంగానే..

ఇసుక గుంతే ఇద్దరి పిల్లల ప్రాణాలు తీసింది. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వేయడంతో ఏర్పడిన నీటి గుంతల కారణంగానే గని ఆత్కూరు వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇక్కడ వాల్టా చట్ట నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. యంత్రాలతో నదీగర్భాన్ని కొల్లగొడుతున్నారు. రీచ్‌లకైతే హద్దుల్లేవు. తవ్వకాలకు అడ్డూ అదుపూ లేదు. రాత్రిపూట భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. వందలాది లారీలు అనుమతికి మించి ఇసుక లోడ్‌ చేసుకుని ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్తున్నాయి. ఇంత యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం స్పందించట్లేదు. నిబంధనలకు విరుద్ధంగా లోతు తవ్వటం వల్ల నీటి గుంతలు ఏర్పడుతున్నాయి. గని ఆత్కూరు గ్రామం నుంచి లంకకు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి నీటి గుంతలు చాలానే ఉన్నాయి.

Updated Date - 2023-04-14T01:04:52+05:30 IST