స్నేహానికి అసలైన నిర్వచనం
ABN , First Publish Date - 2023-08-27T01:20:32+05:30 IST
స్నేహానికి అసలైన నిర్వచనం చెప్పారా స్నేహితులు, బతికుండగానే కాదు..మరణించినా తమ స్నేహం చెరిగిపోలేదని కలకాలం ఉంటుందని నిరూపించారు.
జూన్‌లో మిత్రుడు గుండెపోటుతో మృతి
అతని తల్లిదండ్రులకు రూ.3 లక్షలతో గృహం నిర్మించిన స్నేహితులు
తోట్లవల్లూరు, ఆగస్టు 26: స్నేహానికి అసలైన నిర్వచనం చెప్పారా స్నేహితులు, బతికుండగానే కాదు..మరణించినా తమ స్నేహం చెరిగిపోలేదని కలకాలం ఉంటుందని నిరూపించారు. చిన్న వయస్సులోనే తమ స్నేహితుడు అకాల మరణం చెందటంతో తల్లిదండ్రులను ఆదుకునే బాధ్యతను మిత్ర బృందం భుజాన వేసుకుంది. టీడీపీ తోట్లవల్లూరు గ్రామ కార్యకర్త సయ్యద్ గోరా(32) జూన్ 16న గుండెపోటుతో మృతిచెందాడు. తల్లిదండ్రులు సయ్యద్ అలీ, ముంతాజ్ దిక్కులేనివారయ్యారు. కోరుమల్లి రామకృష్ణ(పండు) ఆధ్వర్యంలో గోరా ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అం దులో 20 మంది గోరా స్నేహితులు చేరారు. అందరూ కలిసి రూ.3 లక్షలు ఖర్చుచేసి మంచి గృహాన్ని నిర్మించి శుక్రవారం రాత్రి గోరా తల్లిదండ్రులకు అప్పగించారు. ఆప్తులందరికి వారే విందు ఏర్పాటు చేశారు. 20 మంది కొడుకులు ఉన్నారని ఏ అవసరమొచ్చినా సహాయం చేస్తామని తల్లిదండ్రులకు వారు అభయమిచ్చారు.