ఈదురు గాలుల బీభత్సం
ABN , First Publish Date - 2023-06-12T00:14:14+05:30 IST
ఈదురుగాలులు చల్లపల్లి మండలంలో బీభత్సం సృష్టించాయి. శనివారం అర్ధరాత్రి దాటాక బలమైన ఈదురుగాలులకు చల్లపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి.
నేలవాలిన చెట్లు
వేర్లతో సహా విరిగిపడిన భారీ వృక్షం
చల్లపల్లి, జూన్ 11 : ఈదురుగాలులు చల్లపల్లి మండలంలో బీభత్సం సృష్టించాయి. శనివారం అర్ధరాత్రి దాటాక బలమైన ఈదురుగాలులకు చల్లపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. పురిటిగడ్డలో యార్లగడ్డ వెళ్లే దారిలో వందేళ్ల నాటి నిద్రగన్నేరు వృక్షం వేర్లతో సహా విరిగి రోడ్డుపక్కన పడింది. చల్లపల్లి ఎంజీ రోడ్డులో పెట్రోల్‌బంకు ఎదురుగా కోటలోని కొబ్బరిచెట్టు విరిగి విద్యుత్‌వైర్లపై పడింది. వైర్లు తెగిపడ్డాయి. కరకట్టపై పెద్దఎత్తున చెట్లు నేలవాలాయి. నిమ్మగడ్డ, వెలివోలు, రాముడుపాలెం, నడకుదురు తదితర గ్రామాల పరిధిలో కరకట్టపై చెట్లు నేలవాలటంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికుల సహాయంతో చల్లపల్లి పోలీసులు విరిగి పడిన చెట్ల తొలగింపునకు చర్యలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచీ సహాయక చర్యలు కొనసాగించారు. ఈదురుగాలుల ప్రభావానికి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.