ప్రతిష్టంభన

ABN , First Publish Date - 2023-06-03T00:23:21+05:30 IST

జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఉద్యోగుల సర్దుబాటుకు ఇంకా రెండు, మూడు రోజుల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. బదిలీల జాబితాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేసినా వాటిలో మార్పులు చేర్పులు ఉంటాయని ఉద్యోగులు భావిస్తున్నారు.

ప్రతిష్టంభన

విడుదల కాని బదిలీల ఉత్తర్వులు

శుక్రవారమంతా కసరత్తు

ఇద్దరు ఎంపీడీవోల బదిలీలు

ఏలూరు జిల్లాకు వెళ్లేందుకు ఉద్యోగుల విముఖత

బాపులపాడు, నందివాడ మండలాలపై చర్చ

జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఉద్యోగుల సర్దుబాటుకు ఇంకా రెండు, మూడు రోజుల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. బదిలీల జాబితాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేసినా వాటిలో మార్పులు చేర్పులు ఉంటాయని ఉద్యోగులు భావిస్తున్నారు.

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు బదిలీపై వచ్చేందుకు ఉద్యోగులు సుముఖంగా ఉండగా, ఏలూరు జిల్లాకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఏలూరు జిల్లా ్లనుంచి కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఉద్యోగులను పంపితే ఇక్కడకు ఎవరు వస్తారని, పోస్టులన్నీ ఖాళీ అయిపోతే తమ జిల్లా పరిస్థితి ఏమిటనే ఉద్దేశంతో ఏలూరు జిల్లా అధికారులు అభ్యంతరం పెడుతున్నారు. దీంతో బదిలీల ప్రక్రియలో గందగోళం నెలకొంది. కలెక్టర్‌ బంగ్లాలో ఉద్యోగుల బదిలీలపై అధికారులు శుక్రవారం కసరత్తు చేశారు. బదిలీలపై నిఘాకు ప్రత్యేక అధికారిని నియమించారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బదిలీల ప్రక్రియ ఆలస్యం కావడంతో ఉద్యోగులు తాము కోరుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు వివిధ రూపాల్లో తమ వంతుగా శుక్రవారమంతా ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. కొందరు ఉద్యోగులు తమకు తెలిసిన జిల్లా అధికారుల ద్వారా, మండలస్థాయి అధికార పార్టీ నాయకుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు చేసుకుంటున్నారు.

బాపులపాడు, నందివాడలకు వెళ్లేందుకు విముఖత

జిల్లాలో బాపులపాడు, నందివాడ మండలాల తహసీల్దార్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈసారి బదిలీల్లో ఈ రెండు మండలాలకు ఎవరిని తహసీల్దార్లుగా నియమిస్తారనే అంశంపై రెవెన్యూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈ రెండు మండలాల్లో ఉన్న శాసనసభ్యులు నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉండటంతో పాటు, తరచూ వివాదాలు నెలకొనే ప్రమాదం ఉండటం, అక్కడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడకు తహసీల్దార్లుగా వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు ఎవ్వరూ ముందుకురాని స్థితి నెలకొంది. దీంతో కలెక్టర్‌ ఎవరిని ఈ ప్రాంతాలకు బదిలీపై పంపుతారనే అంశంపై చర్చ జరుగుతోంది.

జెడ్పీలో ఆరని మంటలు

జిల్లా పరిషత్‌లో ఉద్యోగుల బదిలీలు జెడ్పీ చైర్‌పర్సన్‌, శాసనసభ్యుల మధ్య చిచ్చు రేపుతోంది. గుడివాడ, విజయవాడ తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో గుడివాడ ఎమ్మెల్యే కొడాని నాని తన ప్రాంతంలోని ఉద్యోగుల బదిలీలను నిలిపివేయాలని కోరినా జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త అంగీకరించనట్టు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. పెనుమలూరు శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి ఫోన్‌ కూడా జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తీయకపోవడంతో ఈ ఇద్దరు శాసనసభ్యులు జెడ్పీలో జరిగిన బదిలీలపై గుర్రుగానే ఉన్నట్టు జెడ్పీ ఉద్యోగులు అంటున్నారు. దూరప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు ఇప్పటికే సెలవు పెట్టారు. కక్ష సాధింపులో భాగంగా మంత్రి జోగి రమేష్‌కు అనుకూలంగా ఉన్నారనే కారణంతో పనిట్టుకుని ఏడుగురు ఉద్యోగులను దూరప్రాంతాలకు బదిలీ చేయడంతో ఈ విషయం నివురుగప్పిన నిప్పులా ఉంది. అడ్డగోలుగా తమను బదిలీ చేయడంపై కోర్టును ఆశ్రయిస్తామని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. గతేడాది బదిలీపై వచ్చిన ఉద్యోగులు తమకు అనుకూలంగా లేకపోవడంతో వారందరినీ సక్రమంగా పనిచేయడం లేదనే కారణంచూపి బదిలీ చేసినట్టు ఉద్యోగులు అంటున్నారు. విజయవాడ రూరల్‌ మండలం నుంచి జెడ్పీకి ఒక ఉద్యోగిని బదిలీ చేశారు. ఈ ఉద్యోగి తన వంతుగా ప్రయత్నాలు చేసుకోవడంతో పాతస్థానంలోనే ఉంచేలా ఒప్పందం జరిగినట్టు సమాచారం. జూన్‌ 1వ తేదీన జెడ్పీ ఉద్యోగులను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు జెడ్పీ ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది.

ఇద్దరు ఎంపీడీవోల బదిలీ

ఎంపీడీవోలకు సంబంధించి నూజివీడు ఎంపీడీవో రాణిని ముసునూరు మండలానికి బదిలీ చేశారు. వత్సవాయి ఎంపీడీవో ప్రసాద్‌ను పెనుగంచిప్రోలు మండలానికి బదిలీ చేశారు. జెడ్పీలోని సీనియర్‌ అసిస్టెంట్లు 20 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 32 మందిని, రికార్డు అసిస్టెంట్లు 16 మందిని ల్యాబ్‌ అసిస్టెంట్లు ఏడుగురు, లైబ్రరీ అసిస్టెంట్లు నలుగురు, ఆఫీస్‌ సబార్డినేట్లు ఐదుగురిని బదిలీచేశారు. మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఏవోలుగా, పనిచేస్తున్న నలుగురికి, ఈవోపీఆర్డీలుగా పనిచేస్తున్న ఆరుగురికి ఎంపీడీవోలుగా పదోన్నతి వచ్చింది. తూర్పుగోదావరిజిల్లా నుంచి మరో నలుగురు పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. వీరందరినీ జిల్లాలో వివిద మండలాలకు సర్దుబాటు చేయాల్సి ఉంది. శుక్రవారం రాత్రికి రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయనే ప్రచారం జరిగింది. రాత్రి 8.30 గంటల వరకు ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు.

జిల్లా రిజిస్ట్రారుగా దుర్గా ప్రసాద్‌

మచిలీపట్నం టౌన్‌ : బదిలీల్లో భాగంగా విజయవాడ కమిషనర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న పీవీపీ దుర్గా ప్రసాద్‌ను జిల్లా రిజిస్ట్రారుగా బదిలీ చేశారు. జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఉపేంద్రరావును ప్రకాశం జిల్లా రిజిస్ట్రారుగా బదిలీ చేశారు. జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమ సాధికారత అధికారిగా షాహిద్‌బాబు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖాధికారిగా పనిచేస్తున్న సరస్వతిని వైఎస్సార్‌ కడప జిల్లాకు బదిలీ చేశారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సర్వే శాఖ ఏడీగా పనిచేస్తున్న గోపాలకృష్ణ జిల్లా ఏడీగా బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ సర్వే శాఖ ఏడీగా పనిచేస్తున్న సుసర్ల గోపాలరాజాను కాకినాడకు బదిలీ చేశారు. కాకినాడ జిల్లాలో దివ్యాంగుల శాఖ ఏడీగా పనిచేస్తున్న వాడ్రేవు కావురాజును ఇక్కడకు బదిలీ చేశారు. ఇక్కడ దివ్యాంగుల శాఖ ఏడీగా పనిచేస్తున్న రామ్‌కుమార్‌ను కాకినాడకు బదిలీ చేశారు.

పెడన : పెడన మునిసిపల్‌ కమిషనర్‌ మల్లారపు అంజయ్య బదిలీ అయ్యారు. అంజయ్య స్థానంలో ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మహేంద్రను పెడన మునిసిపల్‌ కమిషనర్‌గా నియమించారు.. పెడన మునిసిపాలిటీలో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఏసుబాబును జగ్గయ్యపేట మునిసిపాలిటీకి బదిలీ చేశారు.

8 మంది తహసీల్దార్ల బదిలీ

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది తహసీల్దార్లను, ఏడుగురు డెప్యూటీ తహసీల్దార్లను బదిలీచేస్తూ కలెక్టర్‌ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయం ఏవో నెల్సన్‌బాబును ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా, కలెక్టరేట్‌లో ఎల్‌ఎపీడూబ్ల్యూ సూపరిటెండెంట్‌గా పనిచేస్తున్న సులోచనను గుడివాడ ఆర్డీవో కార్యాలయ ఏవోగా బదిలీ చేశారు. సీసీఎల్‌ఏలో పనిచేస్తూ జిల్లాకు కేటాయించిన కేఎం కృష్ణకుమారిని తోట్లవల్లూరు తహసీల్దార్‌గా, ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయ ఏవో సోమేశ్వరరావును బందరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా గుడివాడ ఆర్డీవో కార్యాలయ ఏవోగా పనిచేస్తున్న శ్రీనునాయక్‌ను కలెక్టరేట్‌ ఎల్‌ఎపీడబ్ల్యూ సూపరిండెంట్‌గా, కలెక్టరేట్‌ ఎల్‌పీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఏఎస్‌ఎన్‌ రాధికను ల్యాండ్‌సెక్షన్‌ విభాగానికి, బాపులపాడు తహసీల్దార్‌ మల్లికార్జునరావును ల్యాండ్‌ రీఫార్మ్స్‌ స్పెషల్‌ తహసీల్దార్‌గా, తోట్లవల్లూరు తహసీల్దార్‌ కేవి శివయ్యను పెనుమలూరు తహసీల్దార్‌గా బదిలీచేశారు. వీరితోపాటు మరో ఏడుగురు డెప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేశారు.

Updated Date - 2023-06-03T00:23:21+05:30 IST