బచ్చుల జీవన విధానం స్ఫూర్తిదాయకం
ABN , First Publish Date - 2023-03-19T00:58:29+05:30 IST
దివంగత బచ్చుల అర్జునుడి జీవన విధానం స్ఫూర్తిదాయకమని ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు.

విద్యాధరపురం, మార్చి 18 : దివంగత బచ్చుల అర్జునుడి జీవన విధానం స్ఫూర్తిదాయకమని ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. హనుమాన్‌పేటలోని రామాఫంక్షన్ హాలులో ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు, గన్నవరం ఇన్‌చార్జిగా పనిచేసిన బచ్చుల అర్జునుడి సంతాప సభ శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నానీ మాట్లాడుతూ అర్జునుడు అందరివాడని, మచ్చలేని నిబద్దత గల నేత అని, క్రమశిక్షణ ఆయన జీవనశైలి అని పేర్కొన్నారు. ఆయనతో తనకు 2011 నుంచి పరిచయం ఉందన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా నేతగా ఎనలేని సేవలందించారన్నారు.
సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగారన్నారు. కొవిడ్ వల్ల బాధపడిన అర్జునుడికి చంద్రబాబు చొరవతో మెరుగైన వైద్యం అంది పునర్జీవనం పొందారని, కానీ ఆయనకు మళ్లీ తిరిగి ఆస్వస్తత రావడంతో అందరినీ విడిచి పోయారన్నారు. బలహీనవర్గాలుగా ఉన్న యాదవులు మరెన్నో ఉన్నత పదవులు పొందాలన్నారు. టీడీపీ నేతలు, అభిమానులు తొలుత అర్జునుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు.. టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కాకుమల్లిఖార్జున యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ నేతలు, టీడీపీ నేతలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు.