ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్లాలి

ABN , First Publish Date - 2023-06-07T00:39:51+05:30 IST

తెలుగుజాతి ఉన్నంత వరకు వారి హృదయాల్లో పార్టీ ఉంటుందని, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజమండ్రిలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సీఎం జగన్‌రెడ్డి గుండెల్లో దడ పుట్టించిందని మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్లాలి
ఎన్టీఆర్‌ ప్రతిమకు నివాళులర్పిస్తున్న నేతలు

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 6 : తెలుగుజాతి ఉన్నంత వరకు వారి హృదయాల్లో పార్టీ ఉంటుందని, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజమండ్రిలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సీఎం జగన్‌రెడ్డి గుండెల్లో దడ పుట్టించిందని మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో మంగళవారం రాత్రి జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి జగన్‌రెడ్డి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. అన్న క్యాంటీన్లు రద్దుచేసి పేదల పొట్ట కొట్టారన్నారు. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. మాజీ ఎంపీ, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఎక్కడ చూసినా సామాన్యులపై దాడులు పెరిగాయన్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలన్నారు. రాష్ట్ర నేత గొర్రెపాటి గోపీచంద్‌ అధ్యక్షత వహించి ప్రసంగించారు. సంపద సృష్టించే సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. కృష్ణాజిల్లా తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మాట్లాడుతూ, రైతులకు ప్రతి పంటకు రూ. 20వేల ఆర్ధిక సాయం అందించేందుకు చంద్రబాబు ముందుకు రావడం ముదావహమన్నారు. కార్యక్రమంలో కొనకళ్ల బుల్లయ్య, కాగిత వెంకటేశ్వరరావు, లంకే నారాయణ ప్రసాద్‌, తదితరులు మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్‌ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫ బాబు వెంటే మహిళలు..

- ఐటీడీపీ కార్యదర్శి దోనేపూడి రమావేవి

మచిలీపట్నం టౌన్‌ : రాజమండ్రి మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి మ్యానిఫెస్టోలో ఇచ్చిన భరోసాతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆనందోత్సాహాలతో ఉన్నారని ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి దోనేపూడి రమాదేవి అన్నారు. మచిలీపట్నంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు మ్యానిఫెస్టోతో జగన్‌రెడ్డికి దడ పుడుతోందన్నారు. తల్లికి వందనం పథకంలో ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్‌ సిలెండెర్లు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకురావడం పట్ల మహిళలు ఎంతో ఆనందంతో ఉన్నారన్నారు. ఎంతమంది పిల్లలు చదువుకున్నా అందరికీ ఏడాదికి రూ.15 వేలు ప్రకటించడం వల్ల పిల్లలందరూ విద్యావంతులవుతారన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల భృతి, రైతులకు ప్రతి పంటకు రూ. 20వేలు ఆర్ధిక సాయం అదించేందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ ఆనందంతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ కార్య నిర్వాహక కార్యదర్శి మాదాల రాజ్యలక్ష్మి, టీడీపీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి కొండా ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:39:51+05:30 IST