బందరులో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-02-07T01:17:01+05:30 IST

మచిలీప ట్నంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ని కేటాయించడం, అందులో నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతుం డడంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు జిల్లాకోర్టు సెంటరులో సోమవారం ర్యాలీ, నిరసన ప్రదర్శన చేపట్టారు.

బందరులో ఉద్రిక్తత
కొల్లు రవీంద్రను అరెస్టు చేస్తున్న పోలీసులు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌ ..సొంత పూచీకత్తుపై విడుదల

ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని నిలుపుదల చేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని టీడీపీ నిరసన ర్యాలీ

వైసీపీ కార్యాలయం నిర్మించే ప్రాంతానికి వెళ్లకుండా పోలీసుల అడ్డగింత

పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వివాదం.. ఈడ్చి పడేసిన పోలీసులు

కొల్లు రవీంద్రను అరెస్టు చేసి గూడూరు పోలీస్‌ స్టేషన్‌కు, అక్కడి నుంచి పెడన పీఎస్‌, జిల్లా ప్రభుత్వాస్పత్రికి.. జిల్లా కోర్టుకు తరలింపు

గూడూరులో పరామర్శించిన దేవినేని ఉమా, రావి, కాగిత

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం/ మచిలీపట్నం టౌన్‌: మచిలీప ట్నంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ని కేటాయించడం, అందులో నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతుం డడంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు జిల్లాకోర్టు సెంటరులో సోమవారం ర్యాలీ, నిరసన ప్రదర్శన చేపట్టారు. వైసీపీ కార్యాలయ నిర్మాణం నిలిపివేయాలని నినాదాలు చేశారు. బందరు డీఎస్పీ మాసుం బాషా నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీసులు జిల్లాకోర్టు సెంటరుకు చేరుకున్నారు. వైసీపీ కార్యాలయం నిర్మించే ప్రాంతానికి టీడీపీ నాయ కులను వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్య కర్తలకు మద్య తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు ఈడ్చి పడేశారు. కొల్లు రవీంద్ర, తదితరులను వ్యాన్‌లో ఎక్కించి గూడూరు పోలీస్‌స్టేషనుకు తరలించారు. రవీంద్రను వ్యాన్‌ఎక్కించే ముందు అడ్డుగా ఉన్న కార్యకర్తలను పోలీసులు పక్కకు తీసుకెళ్లి, బలవంతంగా వ్యాన్‌ ఎక్కించారు. వ్యాన్‌కు టీడీపీ కార్యకర్తలు అడ్డుపడటంతో వారిని పోలీసులు వారిని పక్కకు నెట్టివేశారు. ఈ సమయంలో రవీంద్రకు, బందరు డీఎస్సీకి వాగ్వివాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తారా అని రవీంద్ర పోలీసులను నిల దీశారు. దీంతో జిల్లా కోర్టు సెంటరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వివాదం జరి గింది. రవీంద్ర, టీడీపీ నాయకులను గూడూరు స్టేషన్‌కు తర లించారు.

గూడూరు స్టేషన్‌కు భారీగా చేరుకున్న నాయకులు

మాజీ మంత్రి దేవినేని ఉమా, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ తదితరులు రవీంద్రతో గూడూరు పోలీస్‌స్టేషనులో మాట్లాడారు. గూడూరు పోలీస్‌స్టేషను వద్దకు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రిజర్వు పోలీసులను అక్కడ మోహరింపచేశారు. టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. తర్వాత కొల్లు రవీంద్రపై కేసు నమోదుచేసి పెడన పోలీస్‌ స్టేషన్‌కు రాత్రి 7.15గంటల సమయంలో తరలించారు. రవీంద్రను గూడూరు నుంచి పెడన పోలీసు స్టేషన్‌కు, అక్కడ నుంచి మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి మచిలీపట్నంలోని జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు. రవీంద్రపై 341, 353 సెక్షన్లు బనాయించారు. పోలీసుల విధులకు కొల్లు రవీంద్ర ఆటంకం కలిగించారని పోలీసులు అరెస్టు చేసి సెకండ్‌ అడిషనల్‌ జిల్లా జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వి .దేవిసాయి శ్రీవాణి ఎదుట రాత్రి 9 గంటలకు హాజరుపరిచారు. న్యాయమూర్తి విచారణ జరిపి రవీంద్రను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వారంలోపు రెండు పది వేల రూపాయల షూరిటీ బాండ్లు ఇచ్చే షరతుపై విడుదల చేశారు.

పేర్ని నానీ.. భూమి మీ అయ్య సొత్తా

జిల్లా కోర్టు సమీపంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ భూమి ఆర్‌ఎస్‌ఆర్‌ 731/ఎ-1 నెంబరుతో చల్లపల్లి సంస్థానం పరిధిలోని మచిలీపట్నం శివగంగ గుడికి చెందిన 5.35 ఎకరాలుగా నమోదై ఉందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చుక్కల భూమిగా గతంలో రెవెన్యూ రికార్డులో ఉన్నట్టు పత్రాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఇటీవల భూమి రికా ర్డులను తారుమారు చేసి ఈ భూమిని పోరంబోకు భూమిగా రెవె న్యూ రికార్డుల్లో మార్చి వేశారని ఆయన అన్నారు. ప్రజావసరాలకు వినియోగించాల్సిన భూమిని వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం ఇచ్చే హక్కును ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. నగర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు ఎమ్మెల్యే పేర్ని నాని కుట్ర చేశారన్నారు. ఈ భూమిలోనే డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య స్మారక భనవం కోసం రెండు ఎకరాలను ఇవ్వకుండా పేర్ని అడ్డుకున్నారని ఆరోపించారు. భూమి మీ అయ్య, మీతాత సొత్తు కాదని పేర్ని నానిపై రవీంద్ర విరుచుకుపడ్డారు. ఇక్కడ కార్యా లయం నిర్మిస్తే గోడలు పడగొట్టేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేస్తూ పార్టీ నాయకులకు ఎవరికీ తెలియకుండా, పిలవకుండా దొంగచాటుగా శంకుస్థాపన చేసినపుడే భూమి కాజేయాలనే పేర్ని నాని నైజం బట్టబయలైం దన్నారు. ప్రజల ఆస్తిని ప్రజా అవసరాల కోసం వినియోగించకుండా, మీ సొంత అవసరాలకు, వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం విని యోగిస్తే టీడీపీ నాయకత్వం చూస్తూ ఊరు కోదన్నారు. ఈ స్థలం పక్కనే పోలీస్‌ క్వార్టర్స్‌ ఉన్నాయని, పోలీసుల అవసరాలకు ఈ భూ మిని వినియోగించాలని గతంలో టీడీపీ ప్రభుత్వం ఆలోచించిందని రవీంద్ర తెలిపారు.

ప్రశ్నిస్తే అరెస్టులా?: దేవినేని ఉమా

ప్రభుత్వ అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తున్న కొల్లు రవీంద్ర ను అరెస్టు చేయిస్తూ, సీఎం జగన్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని వైసీపీ కార్యాలయానికి కట్ట బెట్టడం దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు.

బందరులో పేర్ని, గుడివాడలో కొడాలి అక్రమాలు: రావి

బందరులో ఎమ్మెల్యే పేర్ని నాని, గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల ప్రజల ఆస్తిని పార్టీ కార్యాలయానికి కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారం ఉందని, నగరం నడిబొడ్డున ఉన్న ప్రభు త్వ స్థలాలను అప్పణంగా కాజేద్దామనుకోవడం ఆశ్చర్యంగా ఉంద న్నారు. ప్రజల ఆస్తిని కాపాడేందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందుకు వస్తే అరెస్టు చేయడం అన్యాయమన్నారు. గుడివాడలో కొడాలి నాని కొల్లేరు కట్టలను తమ సొంత చెరువుల కోసం తవ్వు కుపోతున్నారని ఆరోపించారు.

రవీంద్ర అరెస్టు దుర్మార్గం: కాగిత

‘‘కొల్లు రవీంద్ర అరెస్టు దుర్మార్గం. వైసీపీ కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని చూసేందుకు వెళుతున్న ఆయనను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచాలనుకోవడం దురదృష్టకరం. ఇలాంటి ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదు. రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు.’’ అని టీడీపీ పెడన ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ విమర్శించారు.

పెడన స్టేషన్‌కు బుల్లయ్య, నారాయణప్రసాద్‌

మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌ నుంచి పెడన పోలీసు స్టేషన్‌కు టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లంకే నారాయణ ప్రసాద్‌ను తరలించి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచారు. తర్వాత స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి వీరిద్దరినీ మచిలీపట్నానిఇ తరలించారు. టీడీపీ పెడన నియోజక వర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ పరామర్శించారు.

మహిళలను మగ పోలీసులు తోసేయడం అమానుషం

మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌లో నిర్వహించిన ఆందోళన వద్ద జరిగిన తోపులాటలో భూపతి త్రిపుర అనే తెలుగు మహిళ నాయకురాలు సృహ తప్పి పడిపోయింది. ఆమెను చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రశాంతంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళుతున్న సమయంలో పోలీసులు దౌర్జన్యం జరపడంతో భూపతి త్రిపుర స్పృహ కోల్పోయిందని మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు లంకి శెట్టి నీరజ అన్నారు. మహిళా కార్యకర్తలను పురుష పోలీసులు తోసేయడం అమానుషమన్నారు.

Updated Date - 2023-02-07T01:17:01+05:30 IST