గురువుల పోరు ఉద్రిక్తం

ABN , First Publish Date - 2023-09-26T00:10:04+05:30 IST

సీపీఎస్‌ వద్దు.. జీపీఎస్‌ వద్దు .. ఓపిఎస్‌ కావాలి అంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీగా తరలి వచ్చారు.

గురువుల పోరు ఉద్రిక్తం

ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం

టీచర్లకు పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాటలు

ఉపాధ్యాయ సంఘాల నాయకుల అరెస్టు

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 25 : సీపీఎస్‌ వద్దు.. జీపీఎస్‌ వద్దు .. ఓపిఎస్‌ కావాలి అంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీగా తరలి వచ్చారు. సీఎం జగన్‌రెడ్డి వైఖరిని నిరసిస్తూ కలెక్టరేట్‌ ప్రాంగణం టీచర్ల నినాదాలతో ప్రతిధ్వనించింది. టీచర్లను కలెక్టరేట్‌లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీచర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒక ఉపాధ్యాయుడు శీర్షాసనం వేశారు. ప్రభుత్వ విధానాలు ఇలా అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ నినాదాలు చేశారు. బైఠాయింపు జరిపిన టీచర్లు ఒక్కసారిగా దూసుకువచ్చారు. దీంతో టీచర్లకు , పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. టీచర్లను అరెస్టు చేసి మచిలీపట్నం, చిలకలపూడి పోలీసుస్టేషన్‌లకు తరలించారు. ఉపాధ్యాయులకు, పోలీసులకు మధ్య మళ్లీ వాగ్వివాదం ఏర్పడింది. అరెస్టుల అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ బి.లంకేష్‌, సెక్రటరీ జనరల్‌ డి.అశోక్‌ కుమార్‌, ఇతర సంఘాల నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:10:04+05:30 IST