గురువుల బదిలీల్లో గోప్యత
ABN , First Publish Date - 2023-09-22T23:25:54+05:30 IST
జిల్లా టీచర్ల బదిలీల అంశం చర్చనీయాంశమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి కార్యాలయానికి వెళ్లి కప్పంకట్టి నేరుగా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. విద్యాశాఖమంత్రి కార్యాలయం నుంచి విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి ఉత్తర్వులు వెళితే, వాటిని డీఈవో వాట్సాప్ నెంబరుకు పెడుతున్నారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా సంబంధిత టీచర్లకు బదిలీలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి.
మంత్రిపేషీ, విద్యాశాఖ డైరెక్టర్ నుంచి నేరుగా డీఈవోకు బదిలీ ఉత్తర్వులు
మిగులుబాటుగా ఉన్నా ఆదే పాఠశాలలో పోస్టింగ్
టీచర్ల కొరతున్న పాఠశాలలకు ఎస్జీటీల బలవంతపు సర్దుబాటు
జిల్లా టీచర్ల బదిలీల అంశం చర్చనీయాంశమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి కార్యాలయానికి వెళ్లి కప్పంకట్టి నేరుగా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. విద్యాశాఖమంత్రి కార్యాలయం నుంచి విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి ఉత్తర్వులు వెళితే, వాటిని డీఈవో వాట్సాప్ నెంబరుకు పెడుతున్నారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా సంబంధిత టీచర్లకు బదిలీలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఉమ్మడి కృష్ణా జిల్లాలో వందమందికిపైగా టీచర్లకు సంబంధించి బదిలీల ఉత్తర్వులు విడుదలైనట్టు విద్యాశాఖ అధికారులు సూచనపప్రాయంగా చెబుతున్నారు. ఈ ప్రక్రియ కొన్ని రోజులుగా నిరంతరం కొనసాగుతోంద ంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు జిల్లాకేంద్రం లేదా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలకు బదిలీలు చేయించుకునేందుకు ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులను అస్త్రంగా వాడుకుంటున్నారు. మధ్యవర్తులు ద్వారా విద్యాశాఖ మంత్రి పేషికి వెళితే టీచర్లు కోరుకున్న ప్రాంతాన్ని బట్టి, ఆ పోస్టుకోసం ఉన్న పోటీని బట్టి రేటును నిర్ణయిస్తున్నట్టు సమాచారం. మధ్యవర్తులు అడిగినంత కడితే వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఈ ఉత్తర్వులపై విద్యాశాఖ అధికారులుగానీ, విద్యాశాఖ డైరెక్టర్ గానీ ప్రశ్నించడానికి వీలు లేకుండా చేశారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్లు అంటున్నారు. ప్రభుత్వ బదిలీల్లో భాగంగా టీచరు కోరుకున్న పాఠశాలలో ఖాళీ లేకున్నా, మిగులుబాటుగా ఉన్నా అక్కడ పోస్టింగ్ ఇవ్వాల్సి వస్తోందని విద్యాశాఖ అధికారులు గుసగుస లాడుకుంటున్నారు.
ఎస్జీటీలకు బలవంతపు సర్దుబాటు
జిల్లాలో వారం రోజులుగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను సాకుగా చూపి టీచర్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. సబ్జెక్టు టీచర్ల కొరత ఉండటంతో సెకండరీగ్రేడ్ టీచర్లను సర్దుబాటు పేరుతో 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని పాఠ శాలలకు పంపుతున్నారు. వారు పనిచేస్తున్న మండలంలో కాకుండా దూరప్రాంతంలోని ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు లేరనే కారణం చూపి గతేడాది ఎయిడెడ్ పాఠశాలల నుంచి వచ్చిన టీచర్లను జూనియర్‌లుగా చూపి వారిని జిల్లాలో 250 మందికిపైగా ఎస్జీటీలుగా గుర్తించారు. వారిని దూరప్రాంతంలోని ఉన్నత పాఠశాలలు, ప్రాఽథమికోన్నత పాఠశాలలకు సర్దుబాటు పేరుతో పంపుతున్నారు. దీంతో ఎస్జీటీలు తాము దూరప్రాంతాలకు వెళ్లేదిలేదని భీష్మించారు. సర్దుబాటులో భాగంగా ఎస్జీటీలు ఉన్నత పాఠ శాలల్లో సబ్జెక్టు టీచర్లుగా వెళ్లాల్సిందేనని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల నాయకుల దృష్టికి ఎస్జీటీలు ఈ సమస్యను తీసుకువెళ్లారు. ఈ లోగానే బందరు, గుడివాడ డివిజన్‌లలో ఎస్జీటీలను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేసేశారు. బందరు, తదితర మండలాల నుంచి కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలకు సర్దుబాటు అయిన ఎస్జీటీలు అక్కడకు వెళ్లాలా వద్దా అనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో తమకు పదోన్నతులు ఇవ్వమని కోరితే నెలకు రూ.2,500 ప్రత్యేక ఇంక్రిమెంట్‌గా ఇస్తామని చెప్పారని, ఆ విధానం నచ్చక తాము ఉన్నత పాఠశాలలకు సబ్జెక్టు టీచర్లుగా వెళ్లలేదని ఎస్జీటీలు అంటున్నారు. ప్రస్తుతం సర్దుబాటుపేరుతో తమను దూరప్రాంతాలకు పంపితే ఎలాగని ఎస్జీటీలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ బదిలీల ఉత్తర్వులతో ఇష్టారాజ్యంగా టీచర్లను బదిలీలుచేసి, అక్కడ ఏర్పడిన ఖాళీలలో ఎస్జీటీలను సబ్జెక్టు టీచర్లకొరత పేరుతో సర్దుబాటు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఎస్జీటీలను సర్దుబాటు పేరుతో విద్యాసంవత్సరం మధ్యలో 50 కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలలకు పంపే విధానంపై జిల్లా వ్యాప్తంగా పోరుబాట పట్టేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎస్జీటీలు సిద్ధమవుతున్నారు.