ప్రజాస్వామ్యానికి పోలీస్ తూట్లు..!
ABN , First Publish Date - 2023-09-26T00:55:22+05:30 IST
ఓవైపు నిర్బంధాలు.. మరోవైపు నిరసనలు.. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నేతలు మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తే నిరసనలు తెలిపే హక్కు కూడా లేకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎన్టీఆర్ జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ దిల్లీరావును కలిసి ఫిర్యాదు చేశారు.

ప్రతిపక్షాలపై నిర్బంధకాండ ఎన్నాళ్లు..?
నిరసనలపై ఉక్కుపాదం ఎంతకాలం..?
పోలీసుల తీరుపై టీడీపీ నేతల ధ్వజం
తొలుత బొండా ఉమా ఇంట్లో
ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల భేటీ
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ఓవైపు నిర్బంధాలు.. మరోవైపు నిరసనలు.. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నేతలు మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తే నిరసనలు తెలిపే హక్కు కూడా లేకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎన్టీఆర్ జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ దిల్లీరావును కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ శాంతియుతంగా ఆందోళన చేయడానికి కానీ, ధర్నాచౌక్‌లో నిరసనలు తెలపడానికి కానీ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, విపరీతమైన ఆంక్షలు పెట్టి గృహ నిర్బంధం విధిస్తున్నారని, తమ హక్కులకు భంగం కలిగిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పందన కార్యక్రమంలో ఉన్న కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్యం అమలు కావడం లేదన్నారు. రాజకీయ పార్టీలు నిరసన తెలిపే హక్కును కూడా జగన్ ప్రభుత్వం హరిస్తోందన్నారు. టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యం గొంతును నొక్కుతోందన్నారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే అరెస్టులు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇప్పించాలని కోరారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ ్వరరావు, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నాయకులను బయటకు రాకుండా ఇంటి వద్దే హౌస్ అరెస్టు చేస్తున్నారని, బయటకు వస్తే అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారన్నారు. జీవో 1ను హైకోర్టు కొట్టేసినా పోలీసులు మాత్రం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో పోలీస్ కమిషనర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 29న వన్‌టౌన్‌లో జరిగే అధికార పార్టీ కార్యక్రమానికి 50 వేల మందిని సమీకరించాలని ఎమ్మెల్యేలకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని, అప్పుడు టీడీపీకి, ప్రతిపక్షాలకు అమలు చేసిన చట్టాలు అమలు కావా.. అని ప్రశ్నించారు. అనంతరం నేతలంతా సిద్ధార్థ కాలేజీ సెంటర్‌లో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు. అంతకుముందు నాయకులంతా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ద ప్రసాద్, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), బోడె ప్రసాద్, బుద్ధా వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్, కమ్మిలి విఠల్, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
అలుపెరగక..
రెండు జిల్లాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
చంద్రబాబు విడుదల కోసం పూజలు, హోమాలు
చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రజక సాధికార సమితి ఆధ్వర్యంలో సోమవారం సామూహిక రిలే నిరాహార దీక్ష జరిగింది. సమితి అధ్యక్షుడు వల్లూరు మధుసూదనరావు, ఎరుబోతు రమణారావు, పరుచూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మైలవరంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారమూ కొనసాగాయి. ఈ దీక్షకు మాజీమంత్రి దేవినేని ఉమా సంఘీభావం తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, తక్షణం విడుదల కావాలని కోరుతూ శ్రీఅయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు, శ్రీతిరుపతమ్మ అమ్మవారి దేవస్థాన మాజీ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులోని గంగా పార్వతీ సమేత శంభు లింగేశ్వరస్వామి దేవస్థానంలో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. టీడీపీ తిరువూరు ఇన్‌చార్జి శావల దేవదత్ ఆధ్వర్యంలో ‘బాబుతో నేను’ కరపత్రాలను ఆవిష్కరించి, ఇంటింటికీ పంపిణీ చేశారు. చంద్ర బాబు ఆరోగ్యంగా ఉండాలని, న్యాయపరమైన చిక్కులు వీడి బయటకు రావాలని కోరుకుంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, అమ్మాజీ, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, సూర్య కాంతం దంపతులు, టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు శ్రీరాం చినబాబు జగ్గయ్యపేటలోని విఘ్నేశ్వరస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. ఈ హోమానికి నెటె ్టం రఘురాం కూడా హాజరయ్యారు. నందిగామలో జరుగుతున్న రిలే దీక్షల్లో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అమ్మినేని జ్వాలాప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు దీక్ష చేపట్టారు. దీక్షను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. పల్లగిరి సమీపంలోని మునేటిలో నల్లజెండాలతో జలదీక్ష చేపట్టారు.