పల్లెలపై గురి

ABN , First Publish Date - 2023-02-02T00:41:45+05:30 IST

జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్నులు వసూలు చేయాలని ఒత్తిడి అధికమవుతోంది. నెలవారీ టార్గెట్‌లు పెట్టి వసూలు చేస్తున్నారు. జనవరి నెలలో వసూలు చేయనివారిపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.

పల్లెలపై గురి

పంచాయతీలపై ఇంటి పన్నుల ఒత్తిడి

టార్గెట్‌ పూర్తి చేయాలని చెప్పడంతో అప్పులుచేసి మరీ పన్నులు కడుతున్న సెక్రటరీలు

డీఎల్‌పీవోలు, ఈవోఆర్డీలు తనిఖీల పేరుతో వసూళ్లపర్వం?

మార్చి నాటి టార్గెట్‌ను ఈ నెలలోనే పూర్తిచేయాలని హుకుం

జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్నులు వసూలు చేయాలని ఒత్తిడి అధికమవుతోంది. నెలవారీ టార్గెట్‌లు పెట్టి వసూలు చేస్తున్నారు. జనవరి నెలలో వసూలు చేయనివారిపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మార్చిలో పూర్తి చేయాల్సిన ఇంటి పన్నుల వసూలును ఫిబ్రవరిలోనే పూర్తి చేయాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశిస్తున్నారు. సమీక్షా సమావేశాల్లో, టెలీ కాన్ఫరెన్సుల్లో అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. జిల్లాలోనే ఇంతగా ఒత్తిడి చేస్తున్నారని, పక్కనే ఉన్న ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ స్థాయిలో ఒత్తిడి లేదని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుండటంతో అప్పులు చేసి మరీ పంచాయతీ సెక్రటరీలు ఇంటి పన్నులను చెల్లిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలోని 497 పంచాయతీలున్నాయి. వీటి నుంచి రూ.45 కోట్ల ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. అధికారుల నుంచి ఇంటి పన్నుల వసూలుపై ఒత్తిడి అధికమవుతోంది. దీంతో అప్పులు చేసిమరీ పంచాయతీ సెక్రటరీలు ఇంటిపన్నుల బకాయిలను చెల్లిస్తున్నారు. సకాలంలో, ఇచ్చిన టార్గెట్‌ను బట్టి ఇంటి పన్నులు వసూలు చేయని పంచాయతీల జాబితాను ఇటీవల తయారు చేశారు. పెద్దమొత్తంలో ఇంటిపన్నులు చెల్లించాల్సిన పంచాయతీలను వరుస జాబితాలో పెట్టి సంబంధిత సెక్రటరీల నుంచి వారంలో 10 శాతంమేర ఇంటి పన్నులు చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు. తక్కువ మొత్తంలో ఇంటిపన్నులు కట్టించుకున్న సెక్రటరీలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండటంతో కొందరు తాము ఈ ఉద్యోగం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇటీవల కాలంలో కోడూరు మండలం ఒక పంచాయతీ నుంచి తక్కువ వసూలు కావడం, వసూలైన నగదును పంచాయతీలోని ఇతరత్రా పనులకు వినియోగించడంతో అధికారులు సంబంధిత పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెండ్‌ చేస్తామని బెదిరించారు. సదరు సెక్రటరీ తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిపాలయ్యాడు. వారం, పదిరోజులకు ఒకసారి ఎంత మేర ఇంటిపన్నులు వసూలు చేశారు? ఎంతకట్టారు? బకాయిలు ఎంతమేర ఉన్నాయి? ఎప్పటిలోగా చెల్లిస్తారు? చెప్పాలని అధికారులు పదేపదే అడుగుతుండటంతో ఎందుకొచ్చిన ఇబ్బందులని పంచాయతీ సెక్రటరీలు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు అప్పులుచేసి మరీ ఇంటిపన్నులను కడుతున్నారు.

తనిఖీల పేరుతో వసూళ్ల దందా?

జిల్లాలోని పంచాయతీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రతి ఆరు నెలలకోసారి రూ.20 లక్షలలోపు ఆదాయం ఉన్న పంచాయతీలను డీఎల్‌పీవోలు, రూ.20లక్షలకు పైబడిన ఆదాయం ఉన్న పంచాయతీల్లో డీపీవో రికార్డులు తనిఖీ చేస్తారు. డీఎల్‌పీవో, డీపీవోతోపాటు ఈవోపీఆర్డీలు తమ మండలాల పరిధిలోని అన్ని పంచాయతీలను తనిఖీ చేయాల్సి ఉంది. గతంలో రికార్డుల తనిఖీ సక్రమంగా జరగలేదనే కారణంతో ప్రస్తుతం రెండు నెలలకోసారి పంచాయతీలో తనిఖీలకు అధికారులు వెళుతున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో వారు వచ్చినందుకుగాను వాహనాల డీజిల్‌ ఖర్చులు, ఇతరత్రాల రూపంలో పెద్దమొత్తంలో మామూళ్లు సమర్పించుకోవాల్సి వస్తోందని పంచాయతీ సెక్రటరీలు బాహటంగానే చెబుతున్నారు. మామూళ్ల రూపంలో ఇచ్చిన నగదుకు సంబంధించి పంచాయతీల్లో వివిధ ఖర్చుల రూపంలో బిల్లులు పెడితే, ఈ తరహా బిల్లులు ఎందుకు పెట్టారని అధికారులు అభ్యంతరాలు పెడుతున్నారని పంచాయతీ సెక్రటరీలు అంటున్నారు. అధికారులు రికార్డుల తనిఖీకి వచ్చిన సమయంలో అయ్యే ఖర్చులను తామెలా భరిస్తామని పంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌-5 సెక్రటరీలు కూడా ఇంటిపన్నుల వసూలు చేయాల్సి ఉంది. సచివాలయ సెక్రటరీలకు ఈ పని అప్పగించకుండా పంచాయతీల్లో పనిచేసే సెక్రటరీలపైనే ఇంటిపన్నులు, ఇతరత్రా పనుల భారం మోపుతుండటం గమనించదగ్గ అంశం. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్‌ బిల్లుల రూపంలో ప్రభుత్వం మినహాయించుకుంటోందని ఇప్పటికే సర్పంచ్‌లు ఆందోళన బాటపట్టారు. పంచాయతీల ఖాతాల్లో నిధులున్నట్లుగా చూపినా బిల్లులు మాత్రం విడుదలకాని స్థితి. పంచాయతీల్లో చెత్త సేకరణ చేసే గ్రీన్‌ అంబాసిడర్‌లకు జీతాలు పంచాయతీలే భరించాల్సి వస్తోంది. పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీటి పంపింగ్‌, తదితర పనులకు నెలవారీ ఖర్చులు తడిసిమోపెడవుతోంది. ఇంటిపన్నుల రూపంలో వచ్చిన నగదును పంచాయతీల్లోని అత్యవసర ఖర్చులకు తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగించాల్సి వస్తోందని పంచాయతీ సెక్రటరీలు అంటున్నారు.

Updated Date - 2023-02-02T00:41:47+05:30 IST