పారదర్శకంగా ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ
ABN , Publish Date - Dec 30 , 2023 | 01:08 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024లో భాగంగా జనవరి 22న ప్రచురించనున్న తుది జాబితాకు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.
కృష్ణలంక, డిసెంబరు 29 : ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024లో భాగంగా జనవరి 22న ప్రచురించనున్న తుది జాబితాకు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి శుక్రవారం ఓటరు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, అనోమలిస్, ఫారం 6, 7, 8ల పరిష్కారం, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, అధికారులు, సిబ్బంది తదితర అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల కలెక్టర్లతో రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ దిల్లీరావు మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్‌కలెక్టర్ అదితిసింగ్, డీఆర్‌వో ఎస్.నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024లో భాగంగా ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా పరిష్కరిస్తున్నామన్నారు. 22 జనవరి 2024న ప్రచురించే జాబితా తప్పులు లేని తుది ఓటర్ల జాబితాగా వుండేలా అన్ని స్థాయిలలో జాగ్రత్తలు తీసుకొంటున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సిహెచ్.దుర్గాప్రసాద్ వున్నారు.