షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ABN , First Publish Date - 2023-06-07T01:24:44+05:30 IST
:విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కె.కొత్తపాలెం శివారు ఉత్తరపాలెంలో దోనె వెంకటేశ్వరరావుకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమై రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.
మోపిదేవి : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కె.కొత్తపాలెం శివారు ఉత్తరపాలెంలో దోనె వెంకటేశ్వరరావుకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమై రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్‌తో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం చుట్టుముట్టాయి. క్షణాల వ్యవధిలో ఇల్లు మొత్తం దగ్ధమైంది. దోనె వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. నూతనంగా పక్కా గృహం నిర్మించు కునేందుకు ఇంటిలో భద్రపర్చుకున్న రూ.2 లక్షల నగదు, లక్ష విలువ గల బంగారం, వెండి ఆభరణాలు, పిల్లల విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి విచ్చేసి మంటలను అదుపు చేశారు. వీఆర్వో నీలికాంత్ నష్టంపై నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. కె.కొత్తపాలెం శివారు ఉత్తరపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన దోనె వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మోపిదేవి మండల శాఖ సహాయాన్ని అందజేసింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ద్వారా సమకూర్చిన టార్పాలిన్, వంటపాత్రలు, నిత్యావసర సరుకులను తహసీల్దార్ కె.నవీన్ కుమార్, రెడ్‌క్రాస్ ప్రతినిధులు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన ఏపీ సెక్రటేరియేట్ న్యాయవిభాగం జాయింట్ సెక్రటరీ రూ.5 వేలు అందజేశారు. మోపిదేవి మండల శాఖ ఛైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు, వైస్ ఛైర్మన్ ఆర్.సుబ్రహ్మణ్యం, వీఆర్వోలు మూర్తి, నీలికాంత్, జి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.