గొర్రెలమా!
ABN , First Publish Date - 2023-08-01T00:50:16+05:30 IST
అధికారులు ఏది చెబితే అది వినటానికి కౌన్సిలర్లు, ప్రజలు గొర్రెలనుకుంటున్నారా.. రెండు నెలలుగా అక్రమ లేఅవుట్లు, కట్టడాలపై ఫిర్యాదులు చేస్తున్నా, కౌన్సిల్‌లో ప్రశ్నిస్తున్నా ఎందుకు స్పందించటం లేదని పాలకపక్ష కౌన్సిలర్ వట్టెం మనోహర్ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగ్గయ్యపేట, జూలై 31 : అధికారులు ఏది చెబితే అది వినటానికి కౌన్సిలర్లు, ప్రజలు గొర్రెలనుకుంటున్నారా.. రెండు నెలలుగా అక్రమ లేఅవుట్లు, కట్టడాలపై ఫిర్యాదులు చేస్తున్నా, కౌన్సిల్‌లో ప్రశ్నిస్తున్నా ఎందుకు స్పందించటం లేదని పాలకపక్ష కౌన్సిలర్ వట్టెం మనోహర్ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతగా ఆక్రోశిస్తున్నా కొత్తగా లేఅవుట్‌లు వస్తూనే ఉన్నాయని ఫోటోలతో కౌన్సిల్‌లో ప్రదర్శించి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన జగ్గయ్యపేట మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో పాలక, ప్రతిపక్ష కౌన్సిలర్లతో చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధికారులు కౌన్సిల్‌పై కక్ష గట్టి అప్రదిష్టపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశం ఆద్యంతం అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదాలు, అధికారులపై విమర్శనాస్త్రాలతో సాగింది.
విజిలెన్స్‌కు ఆధారాలిస్తా : వట్టెం మనోహర్
పారిశుధ్య విభాగంలో విధులకు హాజరుకాకుండా జీతాలు పొందుతున్న వారి జాబితా, సీసీ ఫుటేజ్ ఆధారాలు తన వద్ద ఉన్నాయని నాలుగు నెలలుగా కౌన్సిల్‌లో పోరాడుతున్నా, ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదని.. ఇక ఆధారాలను విజిలెన్స్‌కు ఇస్తానని చెప్పారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోకపోగా తాజాగా శాంతినగర్‌లో అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా లేఅవుట్‌లు వేస్తున్నారని ఫోటోలతో సహా కౌన్సిల్‌లో ప్రదర్శించారు. చెరుకూరి వారి వీధిలో సచివాలయానికి కూత వేటు దూరంలోనే కనీసం సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా అపార్ట్‌మెంట్ నిర్మిస్తుంటే చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. సచివాలయ టౌన్‌ప్లానింగ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చి తక్షణ చర్యలు తీసుకోవాలని చైర్మన్ రాఘవేంద్ర ఆదేశించారు. విధులకు గైర్హాజరవుతున్న పారిశుధ్య కార్మికుల జాబితాను చైర్మన్ కు అందజేసినట్టు శానిటరీ ఇన్స్‌పెక్టర్ దుర్గాప్రసాద్ చెప్పారు. టౌన్‌ప్లానింగ్ విభాగం సిబ్బంది, ముఖ్య అధికారి లేకపోవటం వల్ల ఏఈకి ఇన్‌చార్జ్ ఇవ్వాల్సి వచ్చిందని, త్వరలోనే చర్యలు చేపడతామని కమిషనర్ మల్లేశ్వరరావు వివరణ ఇచ్చారు.
బడ్డీని కూడా తొలగించలేరా..!
- టీడీపీ కౌన్సిలర్ పేరం ఆగ్రహం
పాతమునిసిపల్ కార్యాలయంలో బడ్డీ వేసి కబ్జా చేసినా కౌన్సిల్ చర్యలు తీసుకోలేకపోవటం అవమానమని టీడీపీ కౌన్సిలర్ పేరం సైదేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఐదురోజుల్లో తొలగిస్తామని చెప్పి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. చైర్మన్ వివరణ ఇస్తు వారం రోజుల్లో విచారించి బడ్డీ తొలగిస్తామని, కమిషనర్‌ను పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.
చెరువు పనుల ప్రతిపాద నలపై టీడీపీ డీసెంట్
ఊరచెరువును దాతలు, సీఎస్సార్ నిధులతో చేయిస్తున్నామని చెబుతూ మునిసిపల్ సాధారణ నిధులతో రూ.40లక్షల మేర ప్రతిపాదనలు ఆజెండాలో చేర్చటంపై టీడీపీ కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి ప్రశ్నించారు. కోట్లు కుమ్మరించి అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, ఏ నిధులు ఎంత వచ్చాయి, ఏ శాఖ పర్యవేక్షిస్తుందో, టెండర్లు పిలిచారా, కాంట్రాక్టర్లు ఎవరో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. చైర్మన్ వివరణ ఇస్తూ టెండర్లు పిలిచామని, ఇరిగేషన్, మునిసిపల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మైనింగ్ శాఖ నుంచి వస్తాయన్న రూ.3కోట్లు వస్తాయో రావో చెప్పలేమని, ఊర చెరువు సుందరీకరణ పనులను, కాంట్రాక్టర్లు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటామన్న హామి మీదనే సాధారణ నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. దాతల పేరు చెప్పి మునిసిపల్ నిధులు ఇస్తామంటే అంగీకరించబోమని డీసెంటు ఇస్తున్నట్టు రామలక్ష్మి చెప్పారు.
కౌన్సిల్‌ను అప్రదిష్టపాలు చేస్తారా..
- డీఈ, ఏఈలపై చైర్మన్ ఆగ్రహం
కౌన్సిల్‌ను అప్రదిష్టపాలు చేసేందుకు మునిసిపల్ డీఈ, ఏఈలు కంకణం కట్టుకున్నారని చైర్మన్ రాఘవేంద్ర మండిపడ్డారు. చిన్న పనులు కూడా చేయటం లేదని, టెండర్లు వేసి పనులు చేయని కాంట్రాక్టర్ల జాబితా తయారు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించినా మూడు నెలలుగా కాలయాపన చేస్తున్నారని, డీఎంఏకు వారిద్దరిని సరెండర్ చేయాలని కమిషనర్‌కు సూచించారు. స్కూల్ జోన్‌లో రూ.10వేల పని చేయించలేకపోయారని మండిపడ్డారు.
పోలీసు నీడలో..!
- మఫ్టీలో ఎస్సై.. ముగ్గురితో బందోబస్తు
జగ్గయ్యపేట మునిసిపల్ కౌన్సిల్ సమావేశం పోలీస్ నీడలో జరిగింది. కౌన్సిల్ సమావేశానికి అన్ని ముఖ్యశాఖల అధికారులతో పాటు పోలీసులకు అజెండా పంపటం ఆనవాయితీ. కౌన్సిల్ సమావేశంలో ఎస్సై బీవీ రామారావు మఫ్టీలో హాజరై కమిషనర్ మల్లేశ్వరరావు పక్కన కూర్చున్నారు. మరో ముగ్గురి సిబ్బందిని కౌన్సిల్ హాలు బయట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షంతో పాటు పాలకపక్షం పెద్ద ఎత్తున విమర్శలు, నిలదీయటంతో పాటు వివాదాలు శృతిమించుతున్నాయి. కౌన్సిల్‌లోకి పోలీసులు రావటం గమనార్హం. ఎస్సై బీవీ రామారావును ఈ విషయాన్ని ప్రస్తావించగా, అజెండా ఇచ్చారని వచ్చానని, స్పందన సమీక్ష ఉండటంతో మఫ్టీలో వచ్చానని, ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదని కొట్టిపారేశారు. దీనిపై అధికార, ప్రతి పక్ష పార్టీల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.