మహిళా సర్పంచ్‌కు అవమానం

ABN , First Publish Date - 2023-06-03T00:55:00+05:30 IST

ఆమె వయసు 75 ఏళ్లు. ఆమె భర్త గ్రామ సర్పంచ్‌గా ఏకఛత్రాధిపత్యంగా 25 ఏళ్ల పాటు పనిచేసి అప్పటి టీడీపీ, కాంగ్రెస్‌ నేతల గౌరవం పొందారు. ఆయన లెగసీతో వైసీపీ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందిన పెద్దావిడ మనసు ఇప్పుడు కష్టపడింది. అభివృద్ధి పనులకు తనను ఆహ్వానించ పోవడంతో చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల సర్పంచ్‌ చిన సైదమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.

మహిళా సర్పంచ్‌కు అవమానం

నందిగామ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తీరుపై ఆవేదన

అభివృద్ధి పనులకు ఆహ్వానం లేదని మండిపాటు

పిలిచి సీటు ఇచ్చి, ఇప్పుడు పక్కన పెట్టారని ఆగ్రహం

చందర్లపాడు, జూన్‌ 2 : లక్ష్మీపురం గ్రామంలోని ఎన్‌ఎస్పీ కాల్వ అభివృద్ధి పనులను మే 31న ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సోదరుడైన ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల గ్రామ సర్పంచ్‌ ఆళ్ల చిన సైదమ్మకు ఆహ్వానం పంపలేదు. పైగా ఆమెపై ఓటమి పాలైన వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడంతో చిన్న సైదమ్మ చిన్నబుచ్చుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

ఎమ్మెల్యే సోదరులు వైఖరి మార్చుకోవాలి

2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడే దిక్కు లేకపోవడంతో ఎమ్మెల్యే జగన్మోహనరావు తన వద్దకు వచ్చి బతిమాలారని, ఆయనపై ఉన్న గౌరవంతో ఎన్నికల్లో పోటీచేసి గెలిచానని సైదమ్మ చెప్పారు. మరుసటి రోజే తనపై ఓడిన వ్యక్తిని ఎమ్మెల్యే తన కార్యాలయానికి పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారని, అయినా తాను బాధ పడలేదని చెప్పారు. అనంతరం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఇంట్లో వ్యక్తికి సీటు ఇచ్చారని, అయినా పార్టీ గెలుపు కోసం తాను కష్టపడ్డానని ఆమె చెప్పారు. ఇటీవల కాలంలో తనను పక్కపెట్టిన ఎమ్మెల్యే సోదరులు ఇతరులను ముందు వరసలో ఉంచారన్నారు. సదరు వ్యక్తులు పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టే పనులన్నీ చేయిస్తూ తనను అవమానాలకు గురి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సోదరుల ఆదేశాల మేరకు అధికారులు కూడా సదరు వ్యక్తులు చెప్పిన పనులే చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సోదరుడు లక్ష్మీపురం గ్రామంలో ప్రారంభించిన అభివృద్ధి పనికి సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను తీవ్రంగా అవమానించారన్నారు. 1981 నుంచి 2006 వరకూ 25 ఏళ్ల పాటు తన భర్త గుడిమెట్ల సర్పంచ్‌గా పనిచేశారని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎవరు శాసన సభ్యుడిగా ఉన్నా ఇంతటి అవమానం చేయలేదన్నారు. తన భర్త పేరుపై తాను గెలిచానని, ఆమె చెప్పారు. నమ్మకంతో వైసీపీకి పనిచేస్తున్న తమ పట్ల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. 75 ఏళ్ల వయసుతో పాటు బీసీ మహిళనైన తన పట్ల ఎమ్మెల్యే సోదరులు తమ వైఖరి మార్చుకోవాలని ఆమె సూచించారు.

స్థానిక రాజకీయాలపై ప్రభావం

సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఆళ్ల కాటంరాజు సతీమణి చిన సైదమ్మ. బీసీ వర్గాలకు చెందిన కాటంరాజు వరుసగా 25 ఏళ్ల పాటు గుడిమెట్ల సర్పంచ్‌గా పనిచేశారు. టీడీపీ ఆధిపత్యం కనబరుస్తున్న రోజుల్లో సైతం ఓటమి ఎరుగలేదు. ఆయన లెగస్సీతో పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన చిన సైదమ్మ ఆమేర గౌరవం పొందలేకపోవడం స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-03T00:55:00+05:30 IST